Share News

ఏడేళ్లకు తల్లిదండ్రుల చెంతకు..

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:16 PM

శివ్వంపేట, ఆగస్టు 24: ఇంటి నుంచి తప్పిపోయిన మానసిక దివ్యాంగుడు పోలీసుల చొరవతో ఏడేళ్ల అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేరాడు. వెతికివెతికి.. ఆశలు వదులుకున్న తరుణంలో కొడుకు ఆచూకీ తెలియడంతో కన్నవారు ఆనందభరితులయ్యారు.

ఏడేళ్లకు తల్లిదండ్రుల చెంతకు..
నాగరాజును తల్లిదండ్రులకు అప్పగిస్తున్న ఆశ్రమ నిర్వాహకులు

మానసిక దివ్యాంగుడిని ఇంటికి చేర్చిన ‘దర్పణం’

శివ్వంపేట, ఆగస్టు 24: ఇంటి నుంచి తప్పిపోయిన మానసిక దివ్యాంగుడు పోలీసుల చొరవతో ఏడేళ్ల అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేరాడు. వెతికివెతికి.. ఆశలు వదులుకున్న తరుణంలో కొడుకు ఆచూకీ తెలియడంతో కన్నవారు ఆనందభరితులయ్యారు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం మగ్దూంపూర్‌ బేతని సంరక్షణ కేంద్రం నిర్వాహకుడు సాజి వర్గీస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెమూల గ్రామానికి చెందిన నడికుడి వెంకటచారి మంజుల దంపతుల పెద్ద కొడుకు నాగరాజు(22) మానసిక దివ్యాంగుడు. మాటలు రావు. 2017లో తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లగా ఇంటి నుంచి తప్పిపోయిన నాగరాజు ఎక్కడెక్కడో తిరుగుతూ మహబూబ్‌నగర్‌ జిల్లా మరికల్లు మండలానికి చేరుకున్నాడు. అక్కడ స్థానికులు నాగరాజును గమనించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు మహబూబ్‌నగర్‌ సీడబ్ల్యూసీ ద్వారా 2017లో శివ్వంట మండలంలోని మగ్దూంపూర్‌ బేతని సంరక్షణ కేంద్రంలో నాగరాజును చేర్పించారు. తల్లిదండ్రులు చౌటుప్పల్‌ పోలీ్‌సస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా పోలీసులు నాగరాజు వివరాలను ‘దర్పణం’ యాప్‌లో నమోదు చేయగా బేతని సంరక్షణ కేంద్రంలో ఉన్నట్టు గుర్తించారు. గురువారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు ఆధారాలతో వచ్చారు. సంరక్షణ కేంద్రం నిర్వాహకులు సాజీ వర్గీస్‌, మెదక్‌ జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, క్యాంప్‌ ఇన్‌చార్జి విన్సెంట్‌, సోషల్‌ వర్కర్‌ వీరబాబు సమక్షంలో నాగరాజును తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడేళ్లుగా కొడుకు కోసం వెతకని చోటంటూ లేదని, ఆశలు వదులుకున్న సమయంలో ఆచూకీ తెలిసిందని వెంకటాచారి, మంజుల సంతోషం వ్యక్తం చేశారు. బేతని నిర్వాహకులకు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 11:16 PM