Share News

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా!

ABN , Publish Date - Sep 22 , 2024 | 10:42 PM

పట్టపగలే ట్రాక్టర్లలో తరలింపు వాహనాలకు నెంబర్‌ ప్లేట్లు ఉండవు మైనర్లే డ్రైవర్లు!

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా!
నెంబర్‌ ప్లేటు లేని ట్రాక్టర్‌లో తరలుతున్న ఇసుక

చిన్నకోడూరు, సెప్టెంబరు 22: మండల కేంద్రంతో పాటు, మండలంలోని పలు గ్రామాలకు పట్ట పగలే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమార్కులు అదును చూసి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సరిహద్దు మండలాలైన కోహెడ, బెజ్జంకి మండలాల నుంచి వ్యాపారులు ఇసుకను మండలంలోని పలు గ్రామాలతో పాటు, సిద్దిపేట జిల్లా కేంద్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

నెంబరు ప్లేటు లేని వాహనాల్లో...

గుట్టు చప్పుడు కాకుండా నెంబరు ప్లేటు లేని వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం లాభసాటిగా మారడంతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మండల సరిహద్దు దాటుకుని రోజుకు పదుల సంఖ్యలో ఇసుక వాహనాలు వెళ్తున్నాయి. ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎక్కువగా మైనర్లే నడుపుతున్నారు. ఇసుక వాహనాలను డ్రైవర్లు అతివేగంగా నడపడం వల్ల ఇతర వాహనదారులు, పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓవర్‌ స్పీడ్‌తో వస్తున్న ఇసుక వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను మైనర్లు డ్రైవింగ్‌ చేస్తున్న పట్టించుకోనే నాథుడేలేడని, పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు తనిఖీలు చేసి ఇసుక వాహనాలను స్వాధీనం చేసుకుని నామమాత్రపు జరిమానాలు విధిస్తూ వదిలేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసు, రెవెన్యూశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 22 , 2024 | 10:42 PM