పోయింది కొండంత.. దొరికింది గోరంత..
ABN , Publish Date - Sep 01 , 2024 | 11:17 PM
సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 1: సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకోని వృద్ధులతోపాటు, చదువుకున్న యువకులు, మేధావులు, అధికారులు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు.
సిద్దిపేట జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలు
ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్
అయినా ఫలితం శూన్యం
ప్రతీరోజు రెండు, మూడు కేసులు నమోదు
దొరకని సైబర్ నిందితులు
పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు
సిద్దిపేట క్రైం, సెప్టెంబరు 1: సిద్దిపేట జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. చదువుకోని వృద్ధులతోపాటు, చదువుకున్న యువకులు, మేధావులు, అధికారులు సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. లోన్ యాప్, లాటరీ, పార్ట్‌టైం జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం, పాన్‌కార్డ్ అప్‌డేట్స్, ఆధార్‌కార్డు లింకు పేర్లతో మెసేజ్‌లు రాగానే ప్రజలు ఆశపడి మోసపోతున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో, పట్టణాల్లో, విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ నేరాలు తగ్గడం లేదు. సైబర్ నేరాల ను అరికట్టడంలో పోలీసులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పేరుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సైబర్ నేరాలను అరికట్టడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రతి పోలీ్‌సస్టేషన్లో ప్రతిరోజు రెండు, మూడు సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి అంటే జిల్లా పోలీసు అధికారులు సైబర్ నేరాలను నివారించడంలో విఫలమైనట్లు తెలుస్తున్నది.
ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్
జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కు కాల్‌చేసి వివరాలు నమోదు చేసి సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. సైబర్ క్రైమ్ జరిగిన గంటలోపు 1930కు కాల్ చేసి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అమౌంట్ సీజ్ చేస్తామని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కానీ కొంతమంది బాధితులు సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోగొట్టుకున్న అమౌంటును సీజ్‌చేసి బాధితులకు అప్పగించడం లేదు. సైబర్ క్రైమ్‌లను నివారించడానికి జిల్లాలో ప్రత్యేకంగా సైబర్‌క్రైమ్ పోలీ్‌సస్టేషన్ ఏర్పాటుచేశారు. అందులో ఒక ఏసీపీ, సీఐ, ఎస్‌ఐలను విధులు నిర్వహిస్తున్నా.. ఫలితాలు మాత్రం శూన్యమనే చెప్పవచ్చు. రెండురోజుల క్రితం బెజ్జంకి పోలీ్‌సస్టేషన్లో ఆన్‌లైన్ ట్రేడింగ్ ఇన్వె్‌స్టమెంట్లలో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో వస్తాయని నమ్మించి మోసం చేసిన కేసులో రంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు సైబర్ నేరస్తులను హైదరాబాద్‌లో సిద్దిపేట సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ సంవత్సరంలో సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బుల్లో పోలీసులు కేవలం 20 శాతం ఫ్రీజ్ చేశారు
ప్రతిరోజు రెండు, మూడు కేసులు
జిల్లాలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట సైబర్ క్రైమ్ జరుగుతున్నది. ప్రజల బలహీనతలైన ఆశ, భయం రెండిటిని సైబర్ నేరగాళ్లు చూపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. బాధితులు ప్రతిరోజు స్థానిక పోలీ్‌సస్టేషన్లకు, కమిషనర్ కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్‌కు బారులు తీరుతున్నారు. సరైన న్యాయం దొరక్క వెనుదిరుగుతున్నారు. అధునాతన టెక్నాలజీ ఉన్నప్పటికీ సైబర్ నేరస్తులను మాత్రం పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నట్లు పలువురు బాధితులు విమర్శిస్తున్నారు.
దొరికింది.. గోరంతే..
జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 165 సైబర్‌క్రైమ్ కేసులు నమోదయ్యాయి. రూ.3,84,75,893 బాధితులు పోగొట్టుకోగా... పోలీసులు కేవలం రూ.87,13,872 ఫ్రీజ్ చేశారు. ఈ సంవత్సరం సైబర్‌క్రైమ్ పోలీసులు కేవలం ఎనిమిదిమంది నిందితులను మాత్రమే అరెస్టు చేశారు. అధికారికంగా సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్లో ఫిర్యాదుచేసిన వారు 165 మంది అయితే.. అనధికారికంగా ఫిర్యాదు చేయని వాళ్లు చాలామంది ఉన్నారు. బయటకు చెబితే పరువుపోతుందని ఫిర్యాదు చేయకుండా వెనకడుగు వేస్తున్నారు. ప్రతిరోజు రాంగ్ కాల్స్‌తో, రాంగ్ మెసేజ్‌లతో సైబర్ క్రైమ్‌కు గురవుతున్నారు. ఇకనైనా పోలీసులు సైబర్‌క్రైమ్ కేసులపై ప్రత్యేక చర్యలు తీసుకొని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.