బైరాన్‌పల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి
ABN , Publish Date - Sep 16 , 2024 | 11:34 PM
సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
దూళిమిట్ట, సెప్టెంబరు 16: బైరాన్‌పల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, నిజాం రజాకార్లను తరిమికొట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎర్రజెండా పట్టి ఎంతోమంది అమరులైతే, బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బైరాన్‌పల్లి గ్రామంలోని బురుజు వద్ద సీపీఎం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటం ఎర్రజెండా నాయకత్వంలోనే జరిగిందన్నారు. ఈ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పోరాటామన్నారు. ఎర్రజెండా బిడ్డలు అమరులైన ఈ ప్రాంతాన్ని పుణ్యస్థలంగా భావించాలని, బైరాన్‌పల్లి చరిత్రను భావి తరాలకు అందించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాల్లో చేర్చి ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరచాలన్నారు. సాయుధ పోరాట అమరవీరులకు నిజమైన వారసులు ఎర్రజెండ బిడ్డలే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట్‌మావో, బద్దిపడగ కృష్ణారెడ్డి, చోప్పరి రవికుమార్, తాడురి రవికుమార్, దాసరి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.