మత్స్యకారుల్లో ఆశలు
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:02 AM
ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అధికారుల కసరత్తు
నేడు మత్స్యశాఖ ఏడీలతో అత్యవసర సమావేశం
ఇప్పటికే ఆలస్యమైన చేప పిల్లల పంపిణీ
మెదక్, అక్టోబరు 20, (ఆంధ్రజ్యోతి) : యేటా ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్యకారుల ఉపాధికి భరోసా కల్పించేది. 2016లో ఉచిత చేప విత్తనం పంపిణీ పథకం ప్రారంభం కాగా గతేడాది వరకు ఎనిమిదిసార్లు అందజేశారు. ప్రతీ ఏడాది మే, జూన్ వరకు టెండర్లను పూర్తి చేసి ఆగస్టులోగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపలను వదిలే వారు. ఈ ఏడాది ఇప్పటివరకు చేపపిల్లలను పంపిణీ చేయకపోవడంతో గంగపుత్రులు గాబరా పడుతున్నారు. చేప విత్తన పంపిణీకి అదను దాటిపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు. అధికారుల నిర్ణయంపై మత్య్సకారులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.
టెండర్లలో జాప్యం
టెండర్లలో నెలకొన్న జాప్యం కారణంగా ఈ ఏడు చేపపిల్లల విడుదలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. గతేడాది సరఫరా చేసిన చేపపిల్లల విత్తనాల పంపిణీకి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల కాకపోవడంతో ఈసారి ఆన్‌లైన్ టెండర్లు పాల్గొనేందుకు అంతగా ఆసక్తి కనబరచలేదు. ఎన్నిసార్లు నిర్వహించిన టెండర్లు ఖరారు కాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్ధితి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలో చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. ఆగస్టు మాసంలో వదిలే చేప విత్తనం అక్టోబరు మూడో వారం వరకు సరఫరా చేయకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మరోమారు టెండర్లను పిలవడానికి ప్రభుత్వానికి సమయం చాలకపోవడంతో అఽధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే సోమవారం హైదరాబాద్‌లోని ఫిషరీస్ కమిషనరేట్ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ నుంచి జిల్లా మత్స్య సహకార అఽభివృద్ధి అధికారులకు పిలుపు వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో చేప పిల్లల పంపిణీకి మార్గం సుగమం కావచ్చునని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
గతేడాదిలో సగమే.. అదీ ఆలస్యం
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 851 సొసైటీల్లో 53,312 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరికి ఉపాధి కల్పించేందుకు 6.47 కోట్ల చేప పిల్లలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో వదిలేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందులో మెదక్ జిల్లాలో 1,651 చెరువులు, కుంటలతో పాటు ఘనపూర్, హల్దీ, పోచారం ప్రాజక్టులలో ఈ సీజన్‌లో 2.62 కోట్ల చేప విత్తనం వదలాల్సి ఉంది. ఇది గత సంవత్సరం కంటే 50 శాతం తక్కువ. 2023-24 సీజన్‌లో 5.25 కోట్ల చేప పిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈసారి అందులో సగ భాగమే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 1,561 జలాశయాలతో పాటు, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయకమ్మ సాగర్ ప్రాజక్టులలో పెంపకానికి 4.30 కోట్ల పిల్లలు అవసరం ఉండగా 2.15 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 1157 చెరువులు, కుంటలతో పాటు మూడు రిజర్వాయర్లలో 3.41 కోట్ల చేప విత్తనం వదలాల్సి ఉండగా, 1.70 కోట్ల చేప పిల్లల పంపిణీకి ప్రణాళిక రూపొందించారు. టెండర్లు ఖరారు కాకపోవడంతో ఈ అరకొర చేపపిల్లల పంపిణీ కూడా ఆలస్యమైంది.