Share News

తినేదెట్లా!

ABN , Publish Date - Jul 31 , 2024 | 11:48 PM

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం వివిధ వైద్య చికిత్సల నిమిత్తం వచ్చే రోగులు వారి బంధువులకు నాణ్యమైన భోజనం అందించేందుకు శ్రీకారం చుట్టింది.

తినేదెట్లా!
ఆసుపత్రిలో కింద కూర్చుని భోజనం చేస్తున్న రోగుల సహాయకులు

చెత్తకుండీ పక్కన, వర్షంలోనే రోగుల సహాయకుల భోజనాలు

విశ్రాంతి భవనంలో వంటశాల ఏర్పాటు

మలమూత్ర విసర్జనకూ ఇబ్బందులే

సిద్దిపేట జీజీహెచ్‌లో వింత పోకడలు!

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైనం

సిద్దిపేటటౌన్‌, జూలై 31 : ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలన్న సంకల్పంతో గత ప్రభుత్వం వివిధ వైద్య చికిత్సల నిమిత్తం వచ్చే రోగులు వారి బంధువులకు నాణ్యమైన భోజనం అందించేందుకు శ్రీకారం చుట్టింది. రోగుల బంధువులకు ఉదయం, మధ్యాహ్నం సమయంలో హరే రామ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. ఆసుపత్రిలోని రోగుల విశ్రాంతి భవనంలో కూర్చొని తినాల్సిన ఉండగా కొన్ని నెలలుగా ఎండలో, వానలో తడుస్తూ, చెత్త కుండీల పక్కన కూర్చుని భోజనం చేస్తున్నారు. గాలి వీచినపుడు పెద్ద చెత్తకుండీ నుంచి వస్తున్న దుర్వాసనకు రోగుల బంధువులు కడుపునిండా భోజనం చేయలేకపోతున్నారు.

విశ్రాంతి భవనంలో వంటలు..

మూడు వందల పడకల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నిత్యం వేలాది సంఖ్యలో అవుట్‌ పేషంట్‌లు (ఓపీ), అలాగే గర్భిణులు చికిత్స కోసం వస్తుంటారు. వారితో పాటు జనరల్‌ మెడిసిన్‌, సర్జన్‌, గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. ఇలా ఆసుపత్రిలో చేరిన రోగులకు ప్రభుత్వం నాణ్యమైన పోషకాహరాన్ని అందిస్తున్నది. అయితే, వారికి అందించే ఆహారాన్ని ఆసుపత్రిలో ఆవరణలో వం డాల్సిన సదరు కాంట్రాక్టర్లు ఏకంగా రోగుల బంధువుల కోసం కేటాయించిన విశ్రాంతి భవనంలో వంటలు చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో వండాల్సిన వంటలు విశ్రాంతి భవనంలో, విశ్రాంతి భవనంలో తినాల్సిన రోగుల బంధువులు ఆవరణలో తింటున్నారు.

పరిసరాలు కంపు..కంపు

సిద్దిపేటలోని జీజీహెచ్‌ ఆసుపత్రిలో రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేసిన గదిలో వంటలు వండుతుండటంతో, రోగుల బంధువులు మతమూత్ర విసర్జన, స్నానాలు చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన రోగుల బంధు వులు, సహాయకులను ఆసుపత్రి సిబ్బంది ఉదయం, రాత్రి సమయాల్లో అనుమతించపోవడంతో ఆసుపత్రిలో ఏదో ఒక మూలన పడుకుంటున్నారు. విశ్రాంతి గది ఆవరణలో మగ, ఆడ అనే తేడా లేకుండా అందరూ బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణ మొత్తం దుర్వాసన వెదజల్లుతున్నది.

ఎవరికీ చెప్పుకోలేని మహిళలు

జీజీహెచ్‌కు సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. చికిత్స నిమిత్తం ఒక్కోసారి వారం రోజుల వరకు అడ్మిట్‌ అవ్వాల్సి ఉంటుంది. అయితే రోగుల వెంట మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విశ్రాంతి గది, మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మగవారు ఎక్కడ పడితే అక్కడ మూత్రవిసర్జన చేస్తుండగా మహిళలకు సరైన బాత్‌రూంలు లేక అవస్థలు పడుతున్నారు. ఎవరు లేని సమయం చూసి స్నానాలు కూడా అక్కడే చేయాల్సి వస్తున్నది. వంటశాలకు వేరే గది కేటాయించి రోగుల విశ్రాంతి గదిని ఇచ్చేయాలని అధికారులు సూచిస్తున్నా సదరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యఅధికారులు స్పందించి రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని కేటాయించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 11:48 PM