హుండీ.. దైవాధీనమండి!
ABN , Publish Date - Aug 19 , 2024 | 11:48 PM
మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఈనెల 9న గుర్తుతెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి భక్తులు సమర్పించిన నగదు, కానుకలను అపహరించారు. గుడి సమీపంలో సుమారు 30 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం ఐదారు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ దొంగల ఆచూకీ కనుగొనలేదు’’.
ఆదాయంపైనే దృష్టి
రక్షణను పట్టించుకోని వైనం
ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలు
పలుచోట్ల నిద్రపోతున్న నిఘా
పనిచేయని సీసీ కెమెరాలు
ఆరునెలల్లో పలుచోట్ల ఘటనలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఆగస్టు 19: ‘‘మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో ఈనెల 9న గుర్తుతెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి భక్తులు సమర్పించిన నగదు, కానుకలను అపహరించారు. గుడి సమీపంలో సుమారు 30 సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కేవలం ఐదారు మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ దొంగల ఆచూకీ కనుగొనలేదు’’.
‘‘ప్రసిద్దిగాంచిన వర్గల్‌లోని విద్యాధరి ఆలయంలో ఈనెల 8న చోరీకి యత్నించారు. నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి మండపంలోని ప్రవేశద్వారా వద్ద తాళాలు ధ్వంసం చేశారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఓ కత్తిని వదిలేసి ఉడాయించారు.’’
ఏ దిక్కూ లేనివారికి దేవుడే దిక్కంటారు. కానీ ఆ దేవుడికి కూడా దిక్కులేని పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు తెగబడటం నిత్యకృత్యంగా మారుతోంది. హుండీలు కొల్లగొడుతున్నా కూడా ఆలయాల నిర్వహకులు అలసత్వంగానే ఉంటున్నారు. రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిన ఏడుపాయల వనదుర్గ ఆలయం, వర్గల్ విద్యాధరి క్షేత్రాలనూ దొంగలు వదలకపోవడం గమనార్హం.
నిఘా లోపం.. ఆలయాలకు శాపం
జనసంచారం కలిగిన ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ పటిష్ఠంగా ఉండేలా పోలీసు యంత్రాంగం దృష్టిపెట్టాల్సి ఉంటుంది. ప్రధానంగా ఆలయాల్లో ప్రత్యేక నిఘా తప్పనిసరి. సిబ్బందితో పాటు 24 గంటల పాటు పర్యవేక్షించేలా సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాల్సిన అవసరం లేకపోలేదు. అదే విధంగా ఆలయంతోపాటు హుండీలు, ఇతర వస్తువులను రక్షించడానికి సంబంధిత ఆలయ నిర్వహకులూ అప్రమత్తంగా ఉండాలి. కానీ హుండీ ఆదాయంపై ఉన్న శ్రద్ధను వాటి రక్షణపైనా చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ఆదాయంతో సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా ఆలోచించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవున్నాయి. ఈ పరిణామాల వల్లనే దొంగలు ఆలయాలను ఎంచుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల రాకపోకల దృష్ట్యా మిగతా సమయాన్ని తమకు అనువుగా మలుచుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో జరిగిన దొంగతనాలన్నీ అర్ధరాత్రి తర్వాతనే జరగడం గమనార్హం.
హుండీ సొమ్ము హుష్‌కాకి..
భక్తులు సమర్పించిన నగదు, కానుకలు, బంగారం, వెండి వస్తువులను హుండీల్లో వేస్తుంటారు. కొన్ని ఆలయాల్లో ఏడాదికోసారి ఇంకొన్ని చోట్ల ఆర్నెళ్లకు, మూడునెలలకు, నెలకోసారి హుండీ నగదు లెక్కిస్తుంటారు. లెక్కిస్తేకానీ ఇందులో ఎంత నగదు ఉందనేది తేలదు. తాజాగా హుండీలనే దొంగలు టార్గెట్ చేస్తుండడంతో దొంగిలించిన సొత్తుపై అంచనాలు ఉండడం లేదు. సొమ్ము రికవరీ సమయంలోనూ దొంగలు చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. దొంగతనం జరిగినట్లుగా ఆలయాల నిర్వాహకులు ఫిర్యాదులు చేసినప్పటికీ హుండీ సొమ్ము ఎంతనే విషయాన్ని అస్పష్టతగానే పేర్కొనాల్సి వస్తోంది. ఇక దేవుళ్లపై ఉన్న బంగారు, వెండి వస్తువులు, ఇతర వస్తువులను సైతం దొంగలు వదలడం లేదు. దొంగలు అపహరించేలా, సాదాసీదాగా తెరుచుకునేలా హుండీలు ఉన్నందునే ఈ పరిస్థితి తలెత్తుతోంది. కట్టుదిట్టమైన హుండీలను ఏర్పాటు చేయాలని, లేదంటే హుండీలకు సరైన భద్రతపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఘటనలు..
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండీ ఎల్లమ్మ ఆలయంలో 20 రోజుల క్రితం హుండీని ధ్వంసం చేసి నగదు అపహరించారు.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో రెండుసార్లు చోరీ జరిగింది. హుండీ ధ్వంసం చేసి డబ్బు అపహరించడంతోపాటు అమ్మవారి కిరీటం, ముక్కుపుడక సైతం ఎత్తుకెళ్లారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ పెద్దమ్మ ఆలయంలోని హుండీ ధ్వంసం చేశారు.
ఫ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మాట్‌పల్లిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో హుండీ పగలగొట్టి నగదు, అమ్మవారి మంగళసూత్రం, ముక్కుపుడక చోరీ చేశారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల పెద్దమ్మ గుడి, సిద్దన్నపేట మాంకాలమ్మ ఆలయంలో దొంగలు హుండీలతో ఉడాయించారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి బంగారు పుస్తెలతాడు అపహరించారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలోని ఆంజనేయ స్వామి ఆలయంలోని రాతి కలశాన్ని గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేశారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్‌లోని పెద్దమ్మ ఆలయ గేటుతాళాలు ధ్వంసం చేసి అమ్మవారి ముక్కుపుడక, మైక్‌సెట్, హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. వారం క్రితమే అనాజ్‌పూర్‌లోని పెద్దమ్మ ఆలయంలోనూ చోరీ జరిగింది.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ హుండీ లెక్కింపు సమయంలోనూ కానుకలుగా వచ్చిన బంగారు ఆభరణాలను తస్కరించారని ఆలయ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం వీరాంజనేయ ఆలయంలో జూన్ 11న దొంగలు హుండీని అపహరించారు.
సంగారెడ్డి జిల్లా భానూరు పోలీ్‌సస్టేషన్ పరిధిలోని నందిగామ దుర్గామాత ఆలయంలో హుండీని పగలగొట్టి కానుకలను దోచుకెళ్లారు.