Share News

ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా రక్షణ

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:40 PM

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది.

ప్రభుత్వ ఆస్తులకు హైడ్రా రక్షణ

చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు ధార్మిక సంస్థల ఆస్తుల రక్షణే ధ్యేయం

చైర్మన్‌గా వ్యవహరించనున్న సీఎం.. కమిషనర్‌గా ఐజీ స్థాయి అధికారి

పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం పరిధిలో చెరువుల రక్షణ జరిగేనా?

పటాన్‌చెరు, జూలై 29: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది. హెచ్‌ఎండీఏ పరిధిలో పెద్దఎత్తున చెరువులు, కుంటలు, గొలుసుకట్టు చెరువులు పెద్దఎత్తున ఆక్రమణకు గురవడంతో ఏటా భారీ వర్షాలకు అనేక జనావాసాలు నీటమునుగుతున్నాయి. విపత్తు నిర్వహణ సైతం పెద్ద ప్రహసనంగా మారుతోంది. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, జిన్నారం మండలాల పరిఽధిలో పెద్దఎత్తున చెరువులు, కుంటలు, కాలువలు కబ్జాకు గురయ్యాయి. ప్రస్తుతం ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని గ్రామాలు, జీహెచ్‌ఎంసీ డివిజన్లు, మున్సిపాలిటీలను ‘హైడ్రా’ పరిధిలోకి తీసుకురావడంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ జీహెచ్‌ఎంసీ డివిజన్లతో పాటు తెల్లాపూర్‌, బొల్లారం, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలు, కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడ, ఇంద్రేశం, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల, ఐనోల్‌, ముత్తంగి, ఇస్నాపూర్‌, పాషమైలారం, లక్డారం, పోచారం, చిట్కుల్‌, రుద్రారం, పాటి, ఘనాపూర్‌, కర్ధనూర్‌, ఐలాపూర్‌, ఐలాపూర్‌తండా, సుల్తాన్‌పూర్‌, దాయర, గండిగూడ, జానకంపేట, వడక్‌పల్లి, బొమ్మన్‌కుంట గ్రామాలను హైడ్రా పరిధిలోకి తెచ్చారు.

ల్యాండ్‌ మాఫియాపై ఉక్కుపాదం

ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల పరిరక్షణ ఇకపై ‘హైడ్రా’ పరిధిలోకి వెళ్లనుంది. దేవాదాయ, వక్ఫ్‌, ఇనాం భూములను కాపాడే బాధ్యత కూడా దానికే అప్పగించారు. అమీన్‌పూర్‌ మండల పరిధిలోని 993, 630 సర్వే నంబర్లలో పెద్దఎత్తున ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కిష్టారెడ్డిపేట, సుల్తాన్‌పూర్‌, పెద్దకంజర్ల తదితర గ్రామాల్లో పెద్దఎత్తున అసైన్డ్‌ భూములను ల్యాండ్‌ మాఫియా అమ్మేస్తున్నది. చెరువులు, కుంటల పరిస్థితి మరీ దారుణంగా మారింది. అమీన్‌పూర్‌ జీవవైవిధ్య పెద్దచెరువు విస్తీర్ణం రోజురోజుకూ కుచించుకుపోతున్నది. పంట కాల్వలు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పెద్దఎత్తున మట్టిని నింపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. జిన్నారం మండలం బొల్లారం పట్టణంలో చెరువులు, కుంటలు మాయమై బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో వనం చెరువు కబ్జా చేసి భవనాలను నిర్మించారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్‌, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ శాఖలు చేష్టలుడిగి చూస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఈ నేపథ్యంలో హైడ్రా రక్షణగా నిలవనుందని భావిస్తున్నారు.

కీలక శాఖల సమన్వయం..

శాఖల మధ్య సమన్వయం, ఉన్నతాధికారుల పర్యవేక్షణతో హైడ్రా కార్యకలాపాలు సాగనున్నాయి. ఒకే గొడుకు కిందకు కీలకమైన శాఖలను తేవడం ద్వారా సమన్వయంతో మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు. హైడ్రా పాలకమండలికి చైర్మన్‌గా సీఎం వ్యవహరించడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కమిషనర్‌గా ఐజీ స్థాయి పోలీసు అధికారి, కమిటీ సభ్యులుగా మున్సిపల్‌శాఖా మంత్రి, రెవెన్యూ, విపత్తు మంత్రి, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, హైదరాబాద్‌ మేయర్‌తో వివిధశాఖలకు చెందిన 14 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా కొనసాగనున్నారు. ‘హైడ్రా’కు బడ్జెట్‌లో ఏకంగా రూ. 200 కోట్లు కేటాయించడం గమనార్హం. ప్రత్యేక పోలీ్‌సస్టేషన్‌, సిబ్బంది, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను నియమిస్తున్నారు. ఉన్నతస్థాయి శాటిలైట్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆక్రమణలను క్షేత్రస్థాయిలో గుర్తించి కూల్చివేయనున్నారు. ఇప్పటికే పటాన్‌చెరు నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలు గుర్తించి నివేదికను సమర్పించాలని నీటిపారుదల, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Updated Date - Jul 29 , 2024 | 11:40 PM