బదిలీపై రావడానికి అధికారుల అనాసక్తి
ABN , Publish Date - Jul 23 , 2024 | 12:00 AM
నర్సాపూర్, జూలై 22: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధశాఖల్లో బదిలీపై రావడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నిశాఖల్లో సిబ్బంది నుంచి అధికారుల వరకు బదిలీల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే.
సిరిసిల్లా జోన్‌లో నర్సాపూర్ ఉండటమే కారణం
నర్సాపూర్, జూలై 22: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధశాఖల్లో బదిలీపై రావడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నిశాఖల్లో సిబ్బంది నుంచి అధికారుల వరకు బదిలీల ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో కూడా బదిలీల ప్రక్రియ జరగ్గా.. నర్సాపూర్‌లో పనిచేసిన ఏఈలంతా బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ఇక్కడికి ఎవరూ రాలేదు. ప్రస్తుతం పీఆర్ నర్సాపూర్, కౌడిపల్లి సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఏఈలు లేని పరిస్థితి నెలకొన్నది. నర్సాపూర్ సబ్ డివిజన్ పరిధిలో నర్సాపూర్, శివ్వంపేట, వెల్తుర్తి, మాసాయిపేట మండలాల్లో మొత్తం ఏడుగురు ఏఈలు ఉండాల్సి ఉండగా.. నలుగురు బదిలీపై వెళ్లగా.. ఉన్న ఇద్దరిలో ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. నర్సాపూర్ పీఆర్ సబ్ డివిజన్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక్క డీఈఈ, ఒక్క ఏఈ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కౌడిపల్లి పీఆర్ సబ్ డివిజన్ పరిధిలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ సబ్ డివిజన్ పరిధిలో ఐదుగురు ఏఈలకుగాను.. నలుగురు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఒక్క డీఈఈ, ఒక్క ఏఈ మాత్రమే ఉన్నారు. బదిలీపై వెళ్లినవారి స్థానంలో ఇక్కడికి ఎవరూ రావడం లేదు. దీనికి ప్రధాన కారణం నర్సాపూర్ నియోజకవర్గం ప్రస్తుతం సిరిసిల్లా జోన్‌లో ఉంది. హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం సిరిసిల్లా జోన్‌లో ఉండటం వల్ల ఇక్కడికి వచ్చే అధికారులకు, ఇతర ఉద్యోగులకు హైదరాబాద్‌తో ఎలాంటి సంబంధం లేకుండాపోతోంది. ఇక్కడికి బదిలీపై వస్తే ఇక సిరిసిల్లా జోన్ ప్రకారం మెదక్, సిద్దిపేట, కామారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో అధికారులు బదిలీపై వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ ఒక్క కార్యాలయమే కాదు ఇతర శాఖల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ ప్రాంత ఉద్యోగులు నర్సాపూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్లా జోన్ నుంచి చార్మినార్ జోన్‌లో కలపాలని కోరుతూనే ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఆయా పార్టీలకు విన్నపాలు చేశారు. కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్మినార్ జోన్‌కు బదులు ఎక్కడో వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లా జోన్‌లో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు.