Share News

ఇక సమరమే!

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:10 PM

అధినేతల రాకతో హోరెత్తనున్న ప్రచారం

ఇక సమరమే!

ఇప్పటికే గులాబీ బాస్‌ కేసీఆర్‌ సభ

తాజాగా గోవా సీఎం కార్నర్‌ మీటింగ్‌

రేపు మెదక్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మోదీ, అమిత్‌షా, రాహుల్‌ సభలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 18 : నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో పార్లమెంటు ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల కదనరంగంలో ప్రచార సునామీ మొదలవనున్నది. బరిలో ఉన్న తమ పార్టీ అభ్యర్థుల విజయానికి అధినేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే మెదక్‌ లోకసభ సెగ్మెంట్‌కు సంబంధించి బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అభ్యర్థులను ప్రకటించి బీఫామ్‌లను సైతం అందజేశాయి. నామినేషన్ల సమర్పణ నుంచే భారీ బలప్రదర్శన చేపట్టేలా అభ్యర్థులు ప్రణాళిక రచించుకున్నారు. అట్టహాస ప్రచార హోరుతో లోక్‌సభ సమరం తారాస్థాయికి చేరనున్నది.

మెదక్‌ లోకసభ నియోజకవర్గంపై ప్రధాన పార్టీలన్నీ దృష్టి సారించాయి. 2004 నుంచి 2019 ఎన్నికల దాకా బీఆర్‌ఎస్‌ ఖాతాలోనే ఉన్న ఈ స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక మెదక్‌ పార్లమెంటులో 18 సార్లు ఎన్నికలు జరిగితే 9 దఫాలుగా విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సైతం మళ్లీ దక్కించుకునేందుకు ఫోకస్‌ పెట్టింది. కేంద్రంలో హ్యాట్రిక్‌పై దృష్టిపెట్టిన బీజేపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

మరో సభకు కేసీఆర్‌ ప్లాన్‌

మెదక్‌ లోకసభ పరిధిలోని పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్‌ నియోజకవర్గాలకు సంబంధించి ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో బహిరంగసభ నిర్వహించారు. మూడు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేసి తమ సందేశం వినిపించారు. ఇక మెదక్‌, దుబ్బాక, గజ్వేల్‌, సిద్దిపేట నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలతోనూ మరో బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో అనుకూలంగా ఉన్న చోట సభను ఏర్పాటు చేయనున్నారు. అప్పటివరకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి తరపున ప్రచారం చేయనున్నారు. మండలాలు, పట్టణాలవారీగా సభలు, రోడ్‌షోలు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

రాహుల్‌తో బహిరంగ సభ

మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఒకచోట జరిగే సభకు రేవంత్‌ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇందిరాగాంధీ ప్రాతినిథ్యం వహించిన మెదక్‌ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతోనూ బహిరంగ సభకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రియాంక గాంధీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేలతో రోడ్‌షోలు కూడా నిర్వహించనున్నట్లు తెలిసింది. స్థానికంగా మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు.

మోదీ, అమిత్‌షా సభలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ఈ లోకసభ నియోజకవర్గ పరిధిలోని తూప్రాన్‌లో సభ నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ నరేంద్రమోదీతో భారీ బహిరంగ సభను తలపెట్టడానికి ఆ పార్టీ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. అదే విధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షాలతోనూ సభలు, లేదా కార్నర్‌ మీటింగ్‌లను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు నామినేషన్‌ సందర్భంగా మెదక్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌కు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ హాజరయ్యారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కీలక నేతలు మెదక్‌ లోకసభ నియోజకవర్గాన్ని చుట్టేయనున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:10 PM