సొంతభవనంలోకి కొమురవెల్లి పోలీస్‌స్టేషన్
ABN , Publish Date - Jul 17 , 2024 | 11:28 PM
ఏడున్నరేళ్లుగా మల్లన్న ఆలయ గెస్ట్‌హౌజ్‌లో.. మూఢనమ్మకాల కారణంగా జాప్యమని ఆరోపణ
చేర్యాల, జూలై 17: కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్ ఇక నుంచి నూతన భవనంలో కొనసాగనుంది. ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకుల నడువ సొంత భవనంలోకి చేరింది. ఈమేరకు బుధవారం ఎస్‌ఐ రాజుగౌడ్ నూతన భవనంలో శాస్త్రోక్తయుక్తంగా పూజలు నిర్వహించి కార్యకలాపాలు ప్రారంభించారు. 2016లో అప్పటి ప్రభుత్వం నూతన మండలాలు ఏర్పాటుచేసిన క్రమంలో చేర్యాలను విభజించి కొమురవెల్లి నూతనమండలాన్ని ఏర్పాటు చేసింది. సొంత భవనం లేకపోవడంతో కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిధిలోని గెస్ట్‌హౌజ్‌ను పోలీ్‌సస్టేషన్ కోసం కేటాయించారు. దీంతో 2016, అక్టోబరు 12న అప్పటిమంత్రి హరీశ్‌రావు పోలీ్‌సస్టేషన్ ప్రారంభించి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఐనాపూర్ దారిలోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంతో రూ.1కోటి వ్యయంతో నూతన భవన నిర్మాణం చేపట్టారు. సుమారు ఏడాదిన్నరక్రితమే పనులు పూర్తవగా, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భవనంలో చనిపోయాడు. ఇదేక్రమంలో భవన ప్రారంభానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మూఢనమ్మకాలు అపోహలని, ఏమాత్రం పట్టించుకోవద్దని కనువిప్పు కలిగించే పోలీసులు వ్యక్తి చనిపోయాడన్న మూఢనమ్మకం కారణంగానే స్టేషన్ ప్రారంభంలో జాప్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా అంశాల పరిగణన దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారుల సూచనాను సారం ఆలయ గెస్ట్‌హౌజ్ నుంచి నూతన భవనంలోకి ఫర్నీచర్, ఇతరత్రా సామగ్రి తరలించి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, త్వరలో ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారుల చేతులమీదుగా అధికారికంగా ప్రారంభిస్తారా? లేదా ఇలానే కొనసాగిస్తారా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.