Share News

గత ప్రభుత్వ హయాంలో భూములు గుంజుకున్నారు

ABN , Publish Date - Jul 27 , 2024 | 11:44 PM

బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ధరం గురువారెడ్డి

గత ప్రభుత్వ హయాంలో భూములు గుంజుకున్నారు
విలేకరులతో మాట్లాడుతున్న ధరం గురువారెడ్డి

గజ్వేల్‌, జూలై 27: గత ప్రభుత్వ హయాంలో పేదల భూములను గుంజుకున్నారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ధరం గురువారెడ్డి ఆరోపించారు. గజ్వేల్‌ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఆయన బీజేపీ నాయకులు మాదాడి జశ్వంత్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట నుంచి మొదలుకుంటే మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, సిద్దిపేట కలెక్టరేట్‌, వర్గల్‌ ఇండస్ట్రీయల్‌ పార్కు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు ఇలా అన్ని చోట్ల జరిపిన భూసేకరణలో అవినీతి జరిగిందన్నారు. పేదలను, రైతులను బెదిరించి గత కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి భూములను లాక్కున్నారని ఆరోపించారు. ఎలాంటి ప్రోసీజర్‌ లేకుండా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌ నిర్మాణానికి 42 ఎకరాల భూమికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని 400 ఎకరాల భూమిని లాక్కున్నారని, సదరు భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. గజ్వేల్‌ మండలం ముట్రాజ్‌పల్లిలో 342 ఎకరాల భూమి ఉంటే 397 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించారని, 55 ఎకరాల నష్టపరిహారం ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతి పరులు కాకపోతే కోట్లాది రూపాయలు ఏలా సంపాదించారని ప్రశ్నించారు. వెంకట్రామారెడ్డి అవినీతిపరుడని, ఆయన్నీ జైలుకు పంపించే వరకు ఉద్యమం చేస్తానని గురువారెడ్డి ప్రకటించారు. ఆయనవెంట బీజేపీ జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు, నత్తి శివకుమార్‌, దేవులపల్లి మనోహర్‌యాదవ్‌, మేక ఉమ, కిరణ్‌కుమార్‌రెడ్డి, నాగుముదిరాజ్‌, అయిల మహేందర్‌, నాయిని సందీప్‌, చెప్యాల వెంకట్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, నరేశ్‌ తదితరులున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 11:44 PM