సులభమైన అభ్యాసనానికి లర్నింగ్ మై స్లేట్
ABN , Publish Date - Aug 19 , 2024 | 11:56 PM
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 19: ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి చదువు నేర్పాలనే తపనతో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇందులో కొందరు పిల్లలు వేగంగా నేర్చుకుంటారు, మరికొందరు వెనుకబాటును ప్రదర్శిస్తారు.
రూపొందించిన సోషల్ టీచర్
అభినందించిన మంత్రులు
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 19: ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి చదువు నేర్పాలనే తపనతో అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇందులో కొందరు పిల్లలు వేగంగా నేర్చుకుంటారు, మరికొందరు వెనుకబాటును ప్రదర్శిస్తారు. మన దగ్గరికి వచ్చిన వందమందికి వందమంది పిల్లలు చదువుకోవడానికి వస్తారు. కానీ కొందరు కనీసం చదవడం, రాయడంలో వెనకపడుతున్నారు. పిల్లలందరికీ సులభంగా విద్య రావాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జడ్పీహెచ్‌ఎస్ సోషల్ టీచర్ ఖేతావత్ థావుర్యానాయక్ ఆసక్తికరమైన ఒక ‘లర్నింగ్ మై స్లేట్’ను రూపొందించారు. పిల్లలు డ్రా పౌట్స్ కాకూడదనే ఉద్దేశంతో తయారు చేశారు. ముఖ్యంగా పాఠశాలలో సమానమైన విద్యను అందించడం, రాయడం, గణిత ప్రక్రియలు సాధించడంలో ఎవరు వెనుక పడకుండా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది. ఒకటే స్లేట్‌లో తెలుగు, ఆంగ్లం, హిందీ, గణిత ప్రక్రియలు ఏకకాలంలో నేర్చుకోవడానికి, విద్యార్థి ఎక్కడ వెనకబడి ఉన్నాడో తెలుసుకోవడానికి ఇది దోహద పడుతుంది. ఒకరకంగా చెప్పాలంటే బహుళ వినియోగం కలిగిన అభ్యాసన ప్రక్రియ సాధనం అని చెప్పవచ్చు. ఈ స్లేటు పుస్తకానికి అనుబంధంగా విద్యాకరికులంలో చేరితే నాణ్యమైన విద్యను విద్యార్థి పొందడానికి బలమైన ఆస్కారం ఏర్పడనుంది. పాఠ్యపుస్తకం, గణిత ప్రక్రియలోనూ ఎన్నో కృత్యాలను మై స్లేట్ లో సాధన చేయడానికి వీలుపడుతుంది.
‘లర్నింగ్ మై స్లేట్’ పనితీరు ఇలా
మై స్లేట్‌పై కనబడే అక్షరాలు.. చుట్టూ పలక మీద ఉంటాయి. తెలుగు సబ్జెక్టుకు సంబంధించి అక్కడ అచ్చులు, హల్లులు అనే వర్గీకరణ కూడా ఉంటుంది. అక్కడ అచ్చులతో హల్లు పదాలను జతచేస్తూ పదాల రూపకల్పన చేస్తారు. అలా రెండు అక్షరాల సరళ పదాలు, మూడు అక్షరాల సరళ పదాలు, ఆర్ తర్వాత గుణింత పదాలు అక్కడ సూత్రబద్ధంగా ప్రింట్ చేయబడ్డాయి. మై స్లేట్ అనే పలకపైన అక్షరాలను జతపరుస్తూ పదాలు నిర్మాణం చేస్తారు. ఉదాహరణకు అమ్మ అనే అక్షరాన్ని మా పక్కన మా వత్తు అక్షరాన్ని సున్న చుట్టి అ నుంచి అమ్మ వరకు అక్షరాన్ని జతపరుస్తాం. జత పరిచిన అక్షరాలను పలక మీద సున్నాలు గీయించి ఆ సున్నా లోపలే ఆ నిర్మాణం ఐడియాలజికల్‌గా మా కు కూడా ం లోనే ఎట్ట రాయాలో చూపించి అమ్మ అనే పదాన్ని పరిచయం చేస్తాం. ఆ పదాన్ని విద్యార్థి పలక మీద చూసి చేస్తాడు. కాబట్టి మర్చిపోకుండా అక్షరాలను గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. గణితం విషయంలో అంకెలను లెక్కించడం కాకుండా బాక్సులను లెక్కిస్తూ అంకెలను చూపిస్తారు. ఇప్పుడు ఒకటి ఎదురుగా బాక్స్‌ని లెక్కిస్తాం. రెండుకి ఎదురుగా రెండు బాక్సు లెక్కిస్తాం. మూడుకెదురుగా మూడు బాక్సులను లెక్కిస్తాం అలా సున్నా నుంచి తొమ్మిది వరకు అంకెలను నేర్పించవచ్చు. అలాగే కింది వైపు నుంచి బాక్సులను తగ్గించుకుంటూ లెక్కించడం వల్ల తీసివేతను కూడా గుర్తు చేయవచ్చు.
మంత్రుల ప్రశంసలు
విద్యను సులభంగా నేర్చుకునేందుకు రూపొందించిన ‘లర్నింగ్ మై స్లేట్’ను మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీతక్కలు అభినందించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎ్‌సఐసీ)ఇంటింటా ఇన్నోవేషన్ సెమినార్‌లో ప్రాథమిక విద్య నుంచి వయోజన విద్య వరకు ఆరునెలల్లో నూరు శాతం అక్షరాస్యత సాధించగలమని ఖేతావత్ థావుర్యానాయక్ మంత్రులకు వివరించారు. వారు ఆ స్లేట్‌ని చూసి దాన్ని త్వరలో శిశు సంక్షేమ విద్యాకరికులంలో చేర్చి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ పిల్లలకు సులభంగా విద్య నేర్చుకోవడానికి, పంపిణీ చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. రూ.98 నుంచి రూ.110 ఖర్చయ్యే ఈ స్లేట్‌ను మంత్రి శ్రీధర్ బాబు నీడ్ ఫుడ్ ఇన్నోవేషన్‌గా గుర్తించి పాఠశాల విద్యాశాఖకు సిఫారసు చేసినట్టు థావుర్యానాయక్ తెలిపారు.