Share News

మణిహారం

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:53 PM

ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో మారనున్న గజ్వేల్‌ డివిజన్‌ దశదిశ

మణిహారం

ఐదు మండలాల గుండా త్రిబుల్‌ఆర్‌

జిల్లాలో 953 ఎకరాల భూసేకరణ

ఏడాది చివరి నాటికి శంకుస్థాపనకు యోచన

గజ్వేల్‌, సెప్టెంబరు 11 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)తో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ డివిజన్‌ దశదిశ మారనుంది. హైదరాబాద్‌ మహానగరానికి చేరువలో ఉన్న గజ్వేల్‌ డివిజన్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం మరో మణిహారం కానున్నది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. మూడు అలైన్మెంట్లను పరిశీలించిన ప్రభుత్వం 158.6 కిలోమీటర్ల విస్తీర్ణం గల ఉత్తరభాగం రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు అనుమతులిచ్చారు. గతంలో భారత్‌ మాల పరియోజన పథకం కింద ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించాలనుకోగా, దీనిని నిలిపివేసినందున ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే గజ్వేల్లో పీడీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి 161ఏఏ నంబర్‌ను కేటాయించింది.

17 గ్రామాల మీదుగా ..

గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలోని రాయపోల్‌, వర్గల్‌, గజ్వేల్‌, మర్కుక్‌, జగదేవ్‌పూర్‌ మండలాల పరిధి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్లనుంది. ఐదు మండలాల పరిధిలో 17 గ్రామాల గుండా నిర్మించనున్నారు. దీనికి అవసరమైన 953 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సంబంధించిన సర్వే పూర్తి చేసి, భూములు కోల్పోతున్న రైతులతో పలుమార్లు చర్చించారు. ఈ ఏడాది చివరినాటికి శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం పని చేస్తున్నది. ఒక్కసారి భూసేకరణ పూర్తయితే రెండు ఏళ్లలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని నేషనల్‌ హైవే అథారిటీ అధికారులు చెబుతున్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కావడంతో ఎక్కడైనా కట్టడాలు, పరిశ్రమలు, ఏవైనా ఉంటే పొలాల గుండా, అడవుల గుండా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రజ్ఞాపూర్‌లో రాణే పరిశ్రమ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ఒకవైపు రింగును అడ్జస్ట్‌ చేసి నిర్మించనున్నారు. గజ్వేల్‌ అర్బన్‌పార్క్‌ గుండా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీంతో అర్బన్‌పార్క్‌ రూపురేఖలను మార్చుకోనుంది. అర్బన్‌పార్కు భూములకు బదులుగా ములుగు జిల్లాలో అటవీశాఖకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. గతంలో మల్లన్నసాగర్‌ భూనిర్వాసితులకు కేటాయించిన ప్లాట్‌ల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ వెళ్లడంతో ఆ ప్లాట్లను అధికారులు రద్దు చేశారు. జిల్లాలో రాజీవ్‌ రహదారి, చిట్యాల-సంగారెడ్డి మార్గం, మనోహరాబాద్‌-గజ్వేల్‌ రైల్వేమార్గం తగలనన్నాయి. వీటి పరిధిలో క్రాసింగ్‌(ఆర్వోబీ, ఆర్‌యూబీ)లను ఏర్పాటు చేయనున్నారు. సర్వీస్‌ రోడ్డు లేకుండా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిసింది.

భూముల మార్కెట్‌ విలువ పెంపు

జిల్లాలో ఆర్‌ఆర్‌ఆర్‌ వెళ్తున్న భూముల విలువలను ప్రభుత్వం రెట్టింపు చేసింది. రైతులకు నష్టం జరుగకుండా నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే గజ్వేల్‌ సబ్‌రిజిస్టార్‌ కార్యాలయం పరిధిలోని రాయపోల్‌ మండలం బేగంపేట్‌లో ఎకరం భూమి విలువ రూ.2,62,500 ఉండగా రూ.5,82,750కి పెంచారు. ఎల్కల్‌లో ధర రూ.2,25,000 ఉండగా రూ.4,99,500లకు పెంచారు. గజ్వేల్‌ మండలం బంగ్లావెంకటాపూర్‌లో రూ.3,37,500 ఉండగా రూ.8,30,250కు పెంచారు. గజ్వేల్‌ మండలం మక్తామాసాన్‌పల్లిలో రూ.3,37,500 ఉండగా రూ.8,30,250కు పెంచారు. ముట్రాజ్‌పల్లిలో రూ.6,75,500 ఉండగా రూ.14,98,500 వరకు పెంచారు. ప్రజ్ఞాపూర్‌ పరిధిలో రూ.7,87,500 ఉండగా పలు సర్వే నంబర్లలో రూ.17,48,250.. మరికొన్ని సర్వే నంబర్లలో రూ.22,05,000 దాకా పెంచారు. వర్గల్‌ మండలం జబ్బాపూర్‌లో రూ.4,50,000 ఉండగా, రూ.8,32,500 లకు పెంచారు. ఇదే మండలం మైలారం గ్రామంలో రూ.5,25,000 ఉంటే దాన్ని రూ.9,71,250కు పెంచారు. నెంటూర్‌ పరిధిలో రూ.4,50,000 ఉండగా రూ.8,32,500లకు పెంచారు. భూమి విలువలు పెంచడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భూపరిహారంపై రైతులకు ఆశలు పెరిగాయి. కానీ చాలా వరకు రైతులు భూమికి భూమి ఇవ్వాలని కోరుతున్నారు. కాగా రైతులకు రూ.10లక్షల నుంచి రూ.25లక్షల వరకు గత పదేళ్ల మార్కెట్‌ విలువ ఆధారంగా నష్టపరిహారం దక్కనుంది.

రియల్‌ రంగానికి ఊతం

కొన్నాళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ రంగం ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణంతో ఊపు అందుకోనుంది. గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలో భూమి ధరలకు రెక్కలు రానున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ, పరిశ్రమ రంగాలకు అనువుగా రోడ్డు, రైలుమార్గాలు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో పరిశ్రమలు భారీగా ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలోని మనోహరాబాద్‌, కర్కపట్లలలో ఇప్పటికే ఇండస్ట్రియల్‌ సెజ్‌లు ఉండగా, ములుగు మండలం సీడ్స్‌హబ్‌గా వర్ధిల్లుతుంది. మర్కుక్‌ మండలంలో కావేరి పరిశ్రమతో పాటు, వర్గల్‌ మండలంలో డూపాయింట్‌ లాంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ రాకతో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 11:53 PM