త్వరలో ఎంబీబీఎస్ మూడో బ్యాచ్!
ABN , Publish Date - Aug 25 , 2024 | 11:17 PM
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 25: సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి(జీఎంసీ) ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల కొత్త బ్యాచ్(2024-25) రానున్నది. దీంతో ఈ కళాశాలలో ఫ్రెష్ బ్యాచ్ వైద్య విద్యార్థుల సందడి త్వరలో మొదలు కానున్నది. 2022లో ఫస్టియర్ తరగతులతో ఈ కళాశాల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
భర్తీ కానున్న మరో 150 సీట్లు
450 కి చేరుకోనున్న ‘మెడికో’ల సంఖ్య
థర్డ్ ఇయర్‌లోకి సంగారెడ్డి జీఎంసీ
హాస్టల్ పక్కా భవనాల నిర్మాణాలు ఆలస్యం
అద్దె భవనాల కోసం అధికారుల అన్వేషణ
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 25: సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి(జీఎంసీ) ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల కొత్త బ్యాచ్(2024-25) రానున్నది. దీంతో ఈ కళాశాలలో ఫ్రెష్ బ్యాచ్ వైద్య విద్యార్థుల సందడి త్వరలో మొదలు కానున్నది. 2022లో ఫస్టియర్ తరగతులతో ఈ కళాశాల అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫస్టియర్, సెకండియర్ కలిసి 300 మంది వైద్య విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే రానున్న 150 మంది వైద్య విద్యార్థులను కలుపుకుని మెడికోల సంఖ్య 450 మందికి చేరుకోనున్నది. కాగా ఈ కళాశాలలో మూడో బ్యాచ్ విద్యార్థులు రానున్న నేపథ్యంలో కళాశాల అధికారులు అవసరమైన ఏర్పాట్లులో నిమగ్నమయ్యారు.
పక్కా ‘హాస్టల్’ భవనాలు ఆలస్యం
ఇదిలా ఉండగా మెడికల్ కళాశాల నిర్మాణ పనుల్లో భాగంగా రెండో విడతలో రూ.143 కోట్లతో ఆర్‌అండ్‌బీ శాఖ వివిధ భవనాల నిర్మాణాలు చేపడుతున్నది. మెయిన్ బ్లాక్(జీ+2)తో పాటు ఎంబీబీఎస్ బాలురు, బాలికల హాస్టల్స్, స్టాఫ్ క్వార్టర్స్, కిచెన్ అండ్ డైనింగ్, బాయ్స్ రెసిడెంట్ హాస్టల్, మార్చురీ తదితర భవన నిర్మాణ పనులు ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. అయితే జీ+6 అంతస్తుల్లో ఎంబీబీఎస్ బాలుర హాస్టల్, జీ+8 అంతస్తుల్లో బాలికల హాస్టల్స్ పక్కా భవనాల పనులు జరుగుతున్నాయి. వచ్చేనెలలో కొత్త బ్యాచ్ మెడికోలు రానుండటంతో వసతి ఉండేందుకుగాను హాస్టల్ పక్కా భవనాలు ఇంకా సిద్ధం కాలేవు. తుది దశలోనే నిర్మాణాలు ఉన్నాయి. కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బిల్లులు రావాల్సి ఉన్నది. అందుకే కొన్నిరోజులుగా భవన నిర్మాణ పనులు నెమ్మదించాయి. ఇటీవల మంత్రి దామోదర పర్యటించగా, పనుల్లో వేగం పెంచారు. కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు వచ్చేవరకు సదరు కాంట్రాక్టర్ ఆ భవనాలు అప్పగించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. పక్కా భవనాల నిర్మాణాలు మరింత ఆలస్యం కానుండటంతో చేసేదేమీ లేక మెడికల్ కాలేజీ అధికారులు అద్దె భవనాలు వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే ఆరు నెలల కాలానికి అద్దె భవనాలు కావాలంటూ కళాశాల అధికారులు ప్రకటన జారీచేశారు.
అద్దె భవనాల్లో మళ్లీ హాస్టల్స్
వైద్య విద్యార్థుల వసతి కోసం ఈసారి కూడా మళ్లీ అద్దె భవనాలే దిక్కయ్యాయి. కళాశాల ప్రారంభమైన తొలి ఏడాది వైద్య విద్యార్థుల నుంచి ఇప్పటివరకు మెడికోలకు పక్కా భవనాలు సిద్ధం కాకపోవడంతో అద్దె భవనాల్లోనే ఉండాల్సి వస్తున్నది. సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాతో పాటు బైపాస్ రోడ్డులోని పలు భవనాల్లో వసతి కొనసాగిస్తున్నారు. ఆయా హాస్టల్స్‌లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు తరగతులు
వచ్చేనెలలో మూడో బ్యాచ్ ఫస్టియర్ 150 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ పొందనున్నారు. ఎన్‌ఎంసీ ఆదేశాల మేరకు అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రానున్న వైద్య విద్యార్థుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కళాశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న హాస్టల్స్ భవనాలు ఇంకా అప్పగించలేదు. ఇంకా నిర్మాణాలు పూర్తికావాల్సి ఉన్నది. అందుకోసం అద్దె భవనాల పరిశీలన చేస్తున్నాం. వసతితో పాటు బోధనకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.
- డా.సుధామాధురి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సంగారెడ్డి