Share News

మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యమేల!?

ABN , Publish Date - Sep 26 , 2024 | 11:18 PM

నాలుగేళ్లుగా మగ్గిపోతున్న రూ.54.37 లక్షల నిధులు 56 పనులకు గానూ 24 మాత్రమే పూర్తి

మౌలిక వసతుల కల్పనపై నిర్లక్ష్యమేల!?
మద్దూరులో కొనసాగుతున్న కమ్యూనిటీ మరుగుదొడ్ల పనులు

మద్దూరు, సెప్టెంబరు 26: ప్రభుత్వాలు ఏటా 2011 జనాభా ప్రాతిపదికన గ్రామాలాభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం ద్వారా ఎంపీటీసీ సభ్యులకు ఏటా మౌలిక వసతులు కల్పించేందుకు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం 2020-24 వరకు 56 పనులకు గానూ రూ.83.07 లక్షలు మంజూరు చేసింది. ప్రజా ప్రతినిధులు పనులు చేపట్టడంలో తీవ్ర జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో నిధులు వెనెక్కి వెళ్లే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నా ఎంపీటీసీలు నిర్లక్ష్యం వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు ప్రాధాన్య క్రమంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్‌, నీటి సరఫరా, పాఠశాలల్లో చిన్నచిన్న మరమ్మతులు, ల్యాబ్‌ సౌకర్యాలు, మురుగు కాల్వలు, సామూహిక మరుగుదొడ్లు, పారిశుధ్యం లాంటి పనుల నిర్వాహణను తీర్చేందుకు నిధులు మంజూరవుతున్నా ఎంపీటీసీ సభ్యులు పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 2020-21లో 11 పనులకు గానూ రూ.14.90 లక్షలు మంజూరయ్యాయి. 6 పనులను పూర్తి చేయగా పెండింగ్‌లో ఉన్న 5 పనులకు గానూ రూ.6.50 లక్షల నిధులు ఉన్నాయి. 2021-22లో 20 పనులకు గానూ రూ.26.84 లక్షలు మంజూరయ్యాయి. 12 పనులు పూర్తి చేయగా పెండింగ్‌లో 8 పనులకు గానూ రూ.9.50 లక్షలు ఉన్నాయి. 2022-23లో పనులకు గానూ రూ.25.83 లక్షలు మంజూరయ్యాయి. 4 పనులు పూర్తి చేయగా పెండింగ్‌లో ఉన్న 8 పనులకు గానూ. రూ.17.37 లక్షలు నిధులు మూలుగుతున్నాయి. 2023-24లో 13 పనులకు గానూ రూ. 25.50 లక్షలు మంజూరయ్యాయి. 2 పనులు పూర్తి చేయగా పెండింగ్‌లో ఉన్న 11 పనులకు గానూ రూ.21 లక్షలు ఉన్నాయి. సలాఖ్‌పూర్‌, బైరాన్‌పల్లి, లింగాపూర్‌, దూళిమిట్ట, నర్సాయపల్లి, జాలపల్లి, వంగపల్లి, తోర్నాల, మద్దూరు, మర్మాముల, హన్మతండా, శిబ్బితండా, లద్నూరు, వల్లంపట్ల, దుబ్బతండాలో పనులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.26 లక్షలకు పనుల కేటాయింపు చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రొసీడింగ్‌ కాపీలను అందించలేదని తెలిసింది. ఆరకోర నిధులతో పనులు చేపట్టలేని పరిస్థితితో పాటు బిల్లులు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎంపీటీసీ సభ్యులు వాపోతున్నారు.

Updated Date - Sep 26 , 2024 | 11:18 PM