బల్దియాలో నయా దందా..!
ABN , Publish Date - Jul 27 , 2024 | 11:47 PM
సదాశివపేట, జూలై 27: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బల్దియాలో నయా దందా కొనసాగుతున్నది. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు
సర్కారు భూములకు రెక్కలు
పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగం
సదాశివపేట, జూలై 27: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బల్దియాలో నయా దందా కొనసాగుతున్నది. ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఇచ్చి అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పట్టణం చుట్టూ ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వానికి చెందిన (కందకం) స్థలాల్లో తిష్టవేసిన ఆక్రమణదారులకు గతంలో, తాజాగా ఇంటి నంబర్లను కేటాయించిన అధికారులు మరో అడుగుముందుశారు. పట్టణ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూ యజమాని హక్కు పత్రాలు(డాక్యుమెంట్లు) లేని ఖాళీస్థలాల్లో, ప్రైవేటు వెంచర్లలోని మున్సిపల్‌కు చెందిన పదిశాతం పార్కు స్థలాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, మున్సిపల్ అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన అక్రమ వెంచర్లల్లో రోడ్లు, పార్కుల కోసం వదిలేసిన ఖాళీస్థలాల్లో, ప్రైవేటు, సర్కారు వివాదాస్పద భూముల్లో రాత్రికిరాత్రి ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల షెడ్లు, రేకు డబ్బాల ఫొటోలను చూపుతూ ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారు. బల్దియా అధికారులు కేటాయించిన ఇంటి నంబర్ల ఆధారంగా రిజిస్ర్టేషన్ల శాఖ అధికారులు రిజిస్ర్టేషన్లు చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఈ అడ్డగోలు అక్రమాలపై జూన్ 27న సదాశివపేట మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కొందరు కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. అక్రమ రిజిస్ర్టేషన్లు, ఖాళీస్థలాల్లో కేటాయించిన ఇంటి నెంబర్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సభ్యులు అభ్యంతరం తెలిపిన విషయాలపై సంబంధిత రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు, మున్సిపల్ కమిషనర్ వివరణ ఇచ్చేందుకు నీళ్లు నమిలారు. దీంతో సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సభ్యులు అభ్యంతరం తెలిపిన ఖాళీ స్థలాల్లో ఇంటి నంబర్ల కేటాయింపుపై బల్దియా, రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
నిబంధనలకు నీళ్లు..
సదాశివపేట పట్టణాన్ని రాజులు పాలించిన చరిత్ర ఉన్నది. పట్టణానికి ప్రత్యేకంగా గ్రామకంఠం ఉన్నది. గ్రామకంఠం చుట్టూ పట్టణానికి నాలుగువైపులా అప్పట్లో రాజులు మూడు కిలోమీటర్ల మేర 100 ఫీట్ల వెడల్పుతో లోతైన కందకం తవ్వించారు. కాల క్రమంలో అక్రమార్కులు కందకాన్ని పూడ్చివేసి కబ్జాచేశారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో కందకం స్థలం విలువ చదరపు గజం రూ.లక్షలకు పైగా పలుకుతున్నది. దీంతో కొందరు ఆక్రమణదారులు అధికారులను ప్రసన్నం చేసుకుని ఇంటి నంబర్లు పొందగా.. మరికొందరు భారీ వాణిజ్య భమన సముదాయాలు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. కందకం స్థలంలో దశాబ్దాల క్రితమే అక్రమాలకు బీజం పడడం విశేషం. ఈ క్రమంలో 2010లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కందకం స్థలంలో ఉన్న ఆక్రమణలన్నింటినీ తొలగించాలని, కేటాయించిన ఇంటి నంబర్లను రద్దు చేయాలని, ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలు నేటికీ అమలులో ఉన్నా.. అధికారులు ఈ మధ్యకాలంలో కందకం స్థలాల్లో ఇంటి నంబర్లు కేటాయించడం, కందకంలో నిర్మిస్తున్న నిర్మాణాల జోలికి వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇదిలావుంటే గ్రామకంఠం లోపల సర్వే నంబర్లు ఉండవు. గ్రామకంఠం చుట్టూ ఉన్న కందకం స్థలం, గ్రామకంఠంలోపల ప్రజాప్రయోజనాల కోసం వదిలేసిన ఉమ్మడి ఖాళీస్థలాలు (పోరంబోకు) స్థలాల జాబితా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉంటాయి. ఇక గ్రామకఠంలోని ఇళ్లకు, భవనాలకు, ఇతర ఆస్తులకు ఎలాంటి డ్యాకుమెంట్లు ఉండవు. కేవలం ఇంటి నంబర్లు మాత్రమే ఉంటాయి. మున్సిపల్ రెవెన్యూ విభాగంలో అసి్‌సమెంట్ రికార్డుల్లో ఇంటినెంబర్లు, ఆస్తుల యజమానుల పేర్లు, ఆస్తికి సంబంధించిన కొలతలు నమోదై ఉంటాయి. వీటి ఆధారంగా ఆస్తుల రిజిస్ర్టేషన్లు, మ్యూటేషన్లు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో గ్రామకంఠం లోపల ఉన్న కొన్ని ప్రైవేటు ఆస్తులకు సంబంధించి రిజిస్ర్టేషన్లు జరగకపోయినా సదరు ఖాళీస్థలాల్లో ప్రస్తుత ఆక్రమణదారు అని పేర్కొంటూ బల్దియా ఇంటి నెంబర్లు కేటాయించడం గమనార్హం. మరోవైపు గ్రామకంఠం బయట ఉన్న భూములకు రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్లు, భూమి యాజమాన్యం పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు ఉంటాయి. ఒకవేళ వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పాటుచేస్తే (సర్వే నంబర్, ప్లాట్ నంబర్లు) ఉంటాయి. కానీ మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ర్టేషన్ల శాఖలు బల్దియా పరిఽధిలో చాలాచోట్ల ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలకు, సర్వే నంబర్లు లేకుండా ఇంటి నెంబర్లు కేటాయించడం, ఆ ఇంటి నంబర్లను రిజిస్ర్టేషన్ల శాఖ రిజిస్ర్టేషన్ చేయడం, రిజిస్ర్టేషన్లను బల్దియా యంత్రాంగం మ్యూటేషన్ చేసి ఆమోదించడం వంటివి ఆన్‌లైన్‌లోనే జరిగిపోవడం గమనార్హం. కలెక్టర్ పట్టించుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
ఇటీవల జరిగిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్పిలర్లు ఖాళీస్థలాలకు ఇంటి నెంబర్ల కేటాయించిన విషయాలను ప్రస్తావించారు. కమిషనర్‌గా నేను బాధ్యతలు చేపట్టిన తరువాత ఖాళీస్థలాలకు ఇంటి నెంబర్లు ఎక్కడా కేటాయించలేదు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటాం.
- జె.ఉమా, మున్సిపల్ కమిషనర్