రేషన్‌కార్డు లేక.. రుణమాఫీ కాక
ABN , Publish Date - Aug 04 , 2024 | 11:59 PM
కంది, ఆగస్టు 4: ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతనెల 18న రూ.ఒక లక్షలోపు ఉన్న రైతులకు, 31న రూ.1.5 లక్షలలోపు రుణాలు ఉన్న రైతులకు రుమాఫీ చేసింది. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీకి బ్యాంకుల్లో రేషన్‌కార్డు లింకు అడ్డంకి అయ్యింది.
బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు
రెండు విడతల్లో ఇదే పరిస్థితి
కంది రైతువేదిక వద్ద రైతుల ఆందోళన
కంది, ఆగస్టు 4: ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతనెల 18న రూ.ఒక లక్షలోపు ఉన్న రైతులకు, 31న రూ.1.5 లక్షలలోపు రుణాలు ఉన్న రైతులకు రుమాఫీ చేసింది. అయితే ఇప్పుడు రైతు రుణమాఫీకి బ్యాంకుల్లో రేషన్‌కార్డు లింకు అడ్డంకి అయ్యింది. రైతులు రుణాలు తీసుకున్న బ్యాంకుల్లో రుణమాఫీ కావాలంటే రేషన్‌కార్డు లింక్ చేయాల్సిందేనని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కుటుంబానికి ఒక్కటే రేషన్‌కార్డు ఉన్న రైతులు, అసలు రేషన్‌కార్డు లేని మరికొందరు రైతులు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రేషన్‌కార్డు లేక రుణమాఫీ కాక ఎందరో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. దీంతో కంది రైతువేదిక వద్ద ఆయా గ్రామాలకు చెందిన పలువురు రైతులు కొన్నిరోజులుగా ఆందోళన చేపడుతున్నారు. రేషన్‌కార్డు లేకున్నా తమకు రుణమాఫీ చేయించాలని వారు డిమాండ్ చేశారు. రుణమాఫీకి కంది మండలంలో మొదటి విడతలో 1,537 మంది రూ.ఒక లక్ష రుణమాఫీకి అర్హులు కాగా, రెండో విడతల రూ.1.5 లక్షల రుణమాఫీకి 597 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా సంగారెడ్డి, కంది పరిధిలో ఉన్న ఎస్‌బీఐ, ఏపీజీవీబీ, డీసీఎంఎస్, గ్రామీణ బ్యాంకులతో పాటు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు.
వేధిస్తున్న రేషన్‌కార్డు సమస్య
ఎక్కువమంది రైతులను రేషన్‌కార్డు సమస్య వేధిస్తున్నది. పదేళ్ల క్రితం కొత్తగా ఇచ్చిన రేషన్‌కార్డులు ఉన్నవారికి రుణమాఫీ కావడం రైతన్నలను ఆవేదనకు గురిచేస్తున్నది. పదేళ్ల క్రితం పెళ్లిలై వేరు కాపురాలు పెట్టిన యువ రైతులు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే ఆ రుణం మాఫీకి ఇప్పుడు రేషన్‌కార్డు ఆటంకంగా మారింది. రేషన్‌కార్డు ఉంటేనే రుణమాఫీ అవుతుందని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో రేషన్‌కార్డు లేని రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. రైతులకు ఉన్న భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రేషన్‌కార్డు లేకుండా రుణమాఫీ జరగడం కోసం ప్రత్యేక వ్యవస్థ ద్వారా సర్వే చేపడుతున్నామని వ్యవసాయ అధికారులు తెలిపారు. త్వరలోనే రుణమాఫీకి అడ్డంకిగా ఉన్న రేషన్‌కార్డు లింకు లేకున్నా బ్యాంకుల్లో రుణమాఫీ అయ్యేలా ఉన్నతస్థాయి కమిటీ పని చేస్తుందని వ్యవసాయ అధికారులు వెల్లడించారు.
మా కుటుంబానికి ఒక్కటే రేషన్‌కార్డు ఉన్నది
కంది మండలంలోని జుల్‌కల్ గ్రామంలో మాది ఉమ్మడి కుటుంబం. మా కుటుంబానికి ఒక్కటే రేషన్‌కార్డు ఉన్నది. పదేళ్ల క్రితం రేషన్‌కార్డులు ఇచ్చారు. ఇప్పుడు మా ఇద్దరు కుమారులు పెళ్లిళ్లు చేసుకొని వేరు కాపురాలు పెట్టారు. 2021లో మా కుటుంబంలో నేను, నా భార్య, ఇద్దరు కుమారులు కలిసి తలా లక్ష చొప్పున రూ.4 లక్షలు పంట రుణం తీసుకున్నాం. రేషన్‌కార్డు మాత్రం అందరికీ కలిపి ఒక్కటే ఉండడంతో రెండు విడతల్లో మాకు ఎవ్వరికి ఒక్కపైసా కూడా రుణమాఫీ కాలేదు. అధికారులు మా సమస్యను పరిష్కరించాలి.
- యూసఫ్, రైతు, జుల్‌కల్
రేషన్‌కార్డు లేదు.. రుణమాఫీ కాదా?
కంది మండలంలోని వడ్డెనగూడతండా పంచాయతీ పరిధిలో ఉన్న కొయ్యగుండు తండా మాది. మాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మా తండా ఏర్పడినప్పటి నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. 2023లో బ్యాంకులో రూ.96 వేలు రుణం తీసుకున్నాను. బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టూ పదిసార్లు తిరిగాను. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ రెండు విడతల్లో ఒకటే కారణం రేషన్‌కార్డు లేకపోవడమే. కొత్త రేషన్‌కార్డు ఎప్పుడు వస్తుందో, రుణమాఫీ ఎప్పుడు అవుతుందో అని ఆశగా ఎదురు చూస్తున్నాం. అధికారులు వెంటనే స్పందించి మాకు రుణమాఫీ అయ్యేలా చూడగలరు.
- మోత్యానాయక్, రైతు, కొయ్య గుండుతండా