Share News

ఊపిరాడటం లేదు

ABN , Publish Date - Aug 19 , 2024 | 11:53 PM

హత్నూర, ఆగస్టు 19: రసాయన పరిశ్రమలు విషం చిమ్ముతున్నాయి. జల, వాయు కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది.

ఊపిరాడటం లేదు
రాత్రి సమయంలో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం

విషం చిమ్ముతున్న పరిశ్రమలు

ముక్కుపుటాలు అదిరే దుర్వాసన

కాల్వలై పారుతున్న వ్యర్థ జలాలు

శాంపిల్స్‌ తీసుకొని చేతులెత్తేస్తున్న పీసీబీ

ఫిర్యాదు చేసినా.. పట్టని వైనం

హత్నూర, ఆగస్టు 19: రసాయన పరిశ్రమలు విషం చిమ్ముతున్నాయి. జల, వాయు కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి సమయంలో పరిశ్రమల్లోనే వ్యర్థ జలాలు, వాయువును వదులుతుండటంతో ఎవరికి చెప్పాలో తెలియక జనం ముక్కుమూసుకుని బతుకుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అధికారులు అటువైపు చూడకపోవడంతో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఆడిందే ఆటగా మారింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని గుండ్లమాచూనూర్‌ శివారు పలు పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో కొన్ని పరిశ్రమలు నిబంధనలను గాలికి వదిలేశాయి. పరిశ్రమల నుంచి యథేచ్ఛగా జల, వాయు కాలుష్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా బయటకు వదిలేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని సమయం సందర్భం లేకుండా వదులుతుండగా, వ్యర్థ జలాలను మాత్రం పరిశ్రమ ఆవరణలో నిర్మించిన ట్యాంకుల్లో నిల్వచేసి పక్కనే ఉన్న నక్కవాగులోకి వదులుతున్నారు. కొన్ని పరిశ్రమలు అర్ధరాత్రి వేళ కలుషిత వ్యర్థ జలాలను విడుదల చేస్తుండటంతో గ్రామస్థులు పట్టుకుని పీసీసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు ఆ నీటి శ్యాంపిళ్లు.. వ్యర్థ జలాలు విడుదల చేస్తున్న పరిశ్రమ వివరాలను అందించారు.

కూలీలు రావడం లేదు..

గుండ్లమాచూనూర్‌ గ్రామ శివారులోని రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న విషవాయువుల కారణంగా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు వస్తే విష వాయువులను పీల్చలేక ఊపిరాడని పరిస్థితి నెలకొంటుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చిన బంధువులు ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల పరిసరాలలోని పంట పొలాల్లో పనులకు కూలీలు రావడం లేదని రైతులు వాపోతున్నారు.

ఫిర్యాదు చేసినా.. పట్టని అధికారులు

రసాయన పరిశ్రమల నుంచి విడుదలవుతున్న జల, వాయు కాలుష్యం గురించి నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా.. ప్రయోజనం లేకుండా పోతుందన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పీసీబీ అధికారులు పరిశ్రమను తనిఖీ చేసే సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి వస్తుండడంతో పరిశ్రమల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. పలుమార్లు పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల శాంపిల్స్‌ సేకరించిన పీసీబీ అధికారులు వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఫిర్యాదు చేస్తే బెదిరింపులు

పరిశ్రమల ఆగడాలపై స్థానికులు ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమల తీరుపై ఎవరు ఫిర్యాదు చేసినా.. వారికి పోలీసుల నుంచి ఫోన్లు రావడం పట్ల విమర్శలకు తావిస్తుంది.

కోర్టులు మొట్టికాయలు వేసినా..

గ్రామ శివారులోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న జల, వాయు కాలుష్యంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా, పరిశ్రమల యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. గ్రామంలోని ఆదర్శ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి పరిశ్రమల కాలుష్యం తీరుపై జిల్లా కోర్టుతో పాటు హైకోర్టుకు ఉత్తరం రాసి తన ఆవేదనను వెళ్లగక్కాడు. అప్పట్లో కోర్టు ఆదేశాలతో ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు చేపట్టినా, ప్రస్తుతం పరిశ్రమలు యధావిధిగానే విషం చిమ్ముతున్నాయి.

ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం

గ్రామ శివారులోని రసాయన ఫార్మా పరిశ్రమలఫై ఏ మాత్రం సమాచారం వచ్చినా, తాము, తమ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని విచారణ చేస్తున్నాం. ఇప్పటికే వీవోసీ మీటరుతో వాయు కాలుష్యాన్ని పసిగట్టడంతో పాటు, వ్యర్థ జలాల శాంపిల్స్‌ సేకరిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం.

- గీత, పీసీబీ ఈఈ

గ్రామంలో బతకలేకపోతున్నాం

మా గ్రామాన్ని ఆనుకొని ఉన్న కంపెనీల నుంచి వస్తున్న విషపూరిత కాలుష్యంతో గ్రామంలో బతకలేకపోతున్నాం. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే అనేక అవస్థలు పడుతున్నాం. పలు సందర్భాలలో కంపెనీల వాసన వల్ల శ్వాస ఆడడం లేదు.

- నిజాముద్దీన్‌, గుండ్లమాచునూర్‌

ఫిర్యాదు చేసినా, అధికారులకు పట్టడం లేదు

పరిశ్రమల నుంచి విషపూరిత వాయువులు వెలువడుతుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పరిశ్రమల కాలుష్యంపై పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. గ్రామ ప్రజలను కూడగట్టి కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం.

- శంకర్‌, మాజీ వార్డుసభ్యుడు

Updated Date - Aug 19 , 2024 | 11:53 PM