రైతాంగ సాయుధ అమరవీరుల సంస్మరణ సభలు
ABN , Publish Date - Sep 08 , 2024 | 10:55 PM
10 నుంచి 17 వరకు: సీపీఎం మండల కార్యదర్శి బాలనర్సయ్య
కొండపాక, సెప్టెంబరు 8: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నాడు సాగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారి అమరత్వాన్ని స్మరిస్తూ, సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 17 వరకు నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సంస్మరణసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల కార్యదర్శి అమ్ముల బాలనరసయ్య పిలుపునిచ్చారు. మండలంలోని వెలికట్ట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం కరపత్రం ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్లు, దొరలు, భూస్వాములు, జాగీర్‌దార్లకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం జరిగిందన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అమరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్మిస్తూ నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పటిమను పునికి పుచ్చుకున్న సీపీఎం ఆధ్వర్యంలో సెప్టెంబరు 10వ తేదీ చిట్యాల (చాకలి) ఐలమ్మ వర్ధంతి నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ సభలునిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ కనకాచారి, తాటోజు రవీంద్రచారి, కొమురవెళ్లి కనకయ్య పాల్గొన్నారు.