Share News

రాజీవ్‌ గుంతలదారి..!

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:09 AM

సిద్దిపేట జిల్లాలో విస్తరించిన రాజీవ్‌ రహదారి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోల్‌ట్యాక్స్‌ పేరిట భారీగా వసూళ్లు చేపడుతున్నారే తప్ప వాహనదారుల ఇబ్బందులను విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజీవ్‌ గుంతలదారి..!
ములుగు మండలం వంటిమామిడి వద్ద..

చిన్నపాటి వర్షాలకే రిపేర్లు

ప్యాచ్‌వర్కులతోనే సరిపెడుతున్న వైనం

వాహనదారులకు తప్పని ఇబ్బందులు

ఏడునెలల్లో 75 ప్రమాదాలు.. 26మంది మృతి

మరమ్మతులు అంతంతే.. వసూళ్లు ఎంతగానో..

రాజీవ్‌ రహదారి నిర్వహణపై విమర్శల వెల్లువ

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 30: సిద్దిపేట జిల్లాలో విస్తరించిన రాజీవ్‌ రహదారి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టోల్‌ట్యాక్స్‌ పేరిట భారీగా వసూళ్లు చేపడుతున్నారే తప్ప వాహనదారుల ఇబ్బందులను విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు జిల్లా మీదుగా ఈ రోడ్డు విస్తరించింది. కరీంనగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిగా పేరున్న ఈ దారిలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాలో సుమారు 90 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించి ఉన్నది. హైదరాబాద్‌ నుంచి గజ్వేల్‌, సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి మీదుగా

రామగుండం వరకు ఈ రహదారిని నిర్మించారు. సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల వెళ్లాల్సిన వాహనాలు కరీంనగర్‌ వరకు ఈ దారి గుండానే రావాల్సి ఉంటుంది. నిత్యం ఈ రహదారి వాహనాలతో రద్దీగా మారుతోంది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వరకు నిత్యం రాకపోకలు సాగించేవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. అయితే, రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో వాహనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నారు.

పెరుగుతున్న ప్రమాదాలు..

రహదారిపై గుంతలు ఏర్పడడంతో వాహనాల వేగం హఠాత్తుగా తగ్గించాల్సి వస్తోంది. దీంతో వెనకనున్న వాహనాలు ఢీకొడుతున్నాయి. ఒక్కోసారి గుంతలను తప్పించే క్రమంలోనూ వాహనాలు డివైడర్లను ఢీకొట్టడం.. లేదంటే రోడ్డు దిగిపోవడం జరుగుతున్నాయి. గుంతలపై ప్రయాణం కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు. జనవరి నుంచి ఇప్పటిరకు రాజీవ్‌ రహదారిపై జిల్లా పరిధిలో 75 ప్రమాదాలు చోటు చేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రమాదాల్లో 26 మంది మరణించారు. 96 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో శాశ్వత వైకల్యం పొందిన బాధితులు సైతం లేకపోలేదు. ఓ వైపు పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనాల వేగం అదుపులోకి రావడం లేదు. దీనికి తోడు గుంతల కారణంగా ప్రమాదాల సంఖ్య పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది.

మొక్కుబడిగా మరమ్మతులు

గుంతలు పడగానే మొక్కుబడిగా ప్యాచ్‌వర్క్‌లు వేసి చేతులు దులుపుకోవడం సర్వసాధారణమైంది. ఇటీవల కురిసిన సాధారణ వానలకే రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. కిలోమీటర్ల కొద్దీ అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి. వీటిని తారుతో నింపే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ వర్షం పడగానే ఈ తారు తేలిపోతోంది. ఇంకా కొన్నిచోట్ల మరమ్మతుల జోలికే వెళ్లడం లేదు. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తే మళ్లీ వర్షానికి తేలిపోతుందని జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల వర్షాకాలం ముగిసేదాకా గుంతల మధ్య నుంచే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. తూతూమంత్రంగా ప్యాచ్‌వర్క్‌లు చేసే బదులుగా రాజీవ్‌రహదారిపై ఒక బలమైన తారు లేయర్‌ను వేస్తే ఫలితం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వసూళ్లు ఫుల్‌..నిర్వహణ నిల్‌

సాధారణంగా రహదారుల నిర్వహణ ఆధారంగానే టోల్‌ పన్నును వసూలు చేస్తుంటారు. హైదరాబాద్‌ చుట్టూ విస్తరించిన రింగురోడ్డును నిత్యం పర్యవేక్షిస్తుంటారు. రోడ్డు కళకళలాడేలా చర్యలు తీసుకుంటారు. దానికి తగినట్లుగా టోల్‌ రుసుమును వసూలు చేస్తుంటారు. రాజీవ్‌ రహదారిపై కూడా ఇటు దుద్దెడలో, అటు గుండ్లపల్లి వద్ద రెం డు చోట్లా టోల్‌గేట్‌లు ఉన్నాయి. రహదారి సరిగా లేదంటూ వాహనదారులు టోల్‌ పన్ను వసూలు చేసేచోట ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం టోల్‌గేట్ల వద్ద ఉండాల్సిన వసతులను సైతం విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా రహదారిని సక్రమంగా నిర్వహించకుంటే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు.

Updated Date - Jul 31 , 2024 | 12:09 AM