రేవంత్ భాష మార్చుకోవాలి: ఎమ్మెల్యే చింతా
ABN , Publish Date - Aug 16 , 2024 | 11:12 PM
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 16: అమెరికా వెళ్లి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి చిప్పు దొబ్బిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు.
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 16: అమెరికా వెళ్లి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి చిప్పు దొబ్బిందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ర్టాల సీఎంలు కూడా రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడటం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలని సూచించారు. అలవి కాని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడతారన్న భయంతోనే తూతూ మంత్రంగా రైతు రుణమాఫీ చేస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేకుండాపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు కాక మీదున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులుగానీ గ్రామాల్లో పర్యటిస్తే అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు రైతుబంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాలుగా మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలుచేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, శివకుమార్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.