Share News

పేదల బియ్యం.. పందికొక్కుల పాలు..!

ABN , Publish Date - Jul 17 , 2024 | 12:10 AM

సంగారెడ్డి జిల్లాలో గత డిసెంబర్‌లో అక్రమంగా తరలిస్తున్న 236 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఆ బియ్యాన్ని జిల్లా కేంద్రంలోని సివిల్‌ సప్లయ్‌ స్టాక్‌ గోదాంలోకి తరలించారు ఆ తర్వాత అఽధికారుల అనుమతితో ఈ బియ్యాన్ని వేలం వేయాలి. కానీ, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ బియ్యం కాస్తా గోదాములోనే పందికొక్కులకు, పురుగులకు ఆహారంగా మారుతోంది.

పేదల బియ్యం..  పందికొక్కుల పాలు..!
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లోని సివిల్‌ సప్లయ్‌ గోదాములో బియ్యం బస్తాలకు బూజు

అక్రమంగా పట్టుబడితే అంతే..!

నెలల తరబడిగా సివిల్‌సప్లయ్‌ గోదాముల్లోనే..

రంగుమారి, పురుగులు పట్టి, గడ్డకట్టిన దుస్థితి

ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 16వేల క్వింటాళ్లు పట్టివేత

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, జూలై 16: సంగారెడ్డి జిల్లాలో గత డిసెంబర్‌లో అక్రమంగా తరలిస్తున్న 236 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఆ బియ్యాన్ని జిల్లా కేంద్రంలోని సివిల్‌ సప్లయ్‌ స్టాక్‌ గోదాంలోకి తరలించారు ఆ తర్వాత అఽధికారుల అనుమతితో ఈ బియ్యాన్ని వేలం వేయాలి. కానీ, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ బియ్యం కాస్తా గోదాములోనే పందికొక్కులకు, పురుగులకు ఆహారంగా మారుతోంది.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని గోదాములో ఏడాది క్రితం పట్టుకున్న 62 క్వింటాళ్ల అక్రమ బియ్యాన్ని నిల్వ చేశారు. ఈ బియ్యాన్ని వేలం వేయకపోవడంతో ఎక్కడికక్కడ పాడైపోతున్నాయి. రంగుమారడంతో పాటు బూజు కూడా పట్టాయి. మూగజీవాలకే తప్ప మనుషులు తినడానికి పనికొచ్చేలా కనిపించడంలేదు.

సంగారెడ్డి, దౌల్తాబాద్‌ సివిల్‌ సప్లయ్‌ స్టాక్‌ పాయింట్లలోనే కాదు. ఉమ్మడి జిల్లాలోని పలు గోదాముల్లో అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న రేషన్‌ బియ్యం పనికి రాకుండా పోతుంది. పట్టుకున్న సమీప గడువులోనే సంబంధిత అధికారుల అనుమతితో ఈ బియ్యాన్ని వేలం వేయాలి. తద్వారా ఆదాయంతోపాటు బియ్యాన్ని వినియోగించే అవకాశం ఉంటుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆదాయం కోల్పోవడమే కాకుండా బియ్యం ఎవరికీ కాకుండా పోతోంది.

ప్రభుత్వ ఖజానాకు గండి..

పేదలకు చెందాల్సిన రేషన్‌ బియ్యాన్ని దళారులు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నారు. కిలోకు రూ.12 చొప్పున కొంటున్నారు. పక్కరాష్ర్టాల్లో రూ.20పైచిలుకు ధరతో అమ్ముతున్నారు. లబ్ధిదారులతోపాటు రేషన్‌షాపుల్లో సేకరించిన ఈ బియ్యాన్ని అడ్డదారుల్లో రాష్ట్రం దాటించే ప్రయత్నంలో పట్టుబడుతున్నాయు. ఇలా స్వాధీనం చేసుకున్న బియ్యమే గోదాముల్లో పేరుకుపోతున్నాయి. రేషన్‌షాపులపై, దళారులపై నిఘా పెట్టకపోయునప్పటికీ కనీసం సీజ్‌ చేసిన బియ్యంపై కూడా దృష్టిసారించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగానే గండిపడుతోంది. బియ్యాన్ని విక్రయించవద్దని ప్రచారం చేయకపోవడం, రేషన్‌షాపులను తనిఖీలు చేయడంలో అలసత్వం వహించడమే ప్రధాన కారణాలుగా భావించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

రోజూ ఏదో ఓ చోట..

జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16వేల క్వింటాళ్ల బియ్యం పట్టుబడిదంటే అతిశయోక్తికాదు. సిద్దిపేట జిల్లాలో 1,275 క్వింటాళ్లు సీజ్‌ చేసి 40 కేసులు నమోదు చేశారు. దాదాపు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులే వీటిని చేధించారు. ఇక మెదక్‌ జిల్లాలో 290 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే పలు సందర్భాల్లో పట్టుకున్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 14,446 క్వింటాళ్ల అక్రమ రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. ఈ జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట బియ్యం పట్టుబడడం సాధారణమైంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు తరలించే క్రమంలో ఈ దందా బట్టబయలవుతోంది.వివిధ జిల్లాల్లో సేకరించిన బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా మీదుగా తరలించడమే భారీ నిల్వలకు కారణంగా చెప్పవచ్చు. ఈ జిల్లాలోని నారాయణ్‌ఖేడ్‌, జహీరాబాద్‌, జోగిపేట, పటాన్‌చెరు, సంగారెడ్డి స్టాక్‌ పాయింట్లలో పెద్ద ఎత్తున అక్రమ బియ్యాన్ని నిల్వ చేశారు.

అనుమతులకూ ఎదురుచూపు

అక్రమ రేషన్‌ బియ్యాన్ని వేలం వేయాలంటే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, ఎప్పటికప్పుడు వేలం వేయడంతో పరిస్థితి ఇందాకా వచ్చేది కాదు. కానీ నెలల తరబడిగా జాప్యం చేయడంతోనే బియ్యం పాడవుతున్నాయు. సంబంధిత జిల్లా కలెక్టర్లు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమ బియ్యాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం సులభమవుతుంది. లేదంటే ఇలాగే పేరుకుపోయి పురుగులకు, పందికొక్కులకు ఆహారమవుతుంది.

Updated Date - Jul 17 , 2024 | 12:10 AM