తప్పిన పదవీ గండం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:02 AM
నెలరోజులుగా సంగారెడ్డి మున్సిపాలిటీలో వేడెక్కిన అవిశ్వాస రాజయకీయానికి తెరపడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీరవికి పదవీ గండం తప్పింది.
సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై వీగిన అవిశ్వాసం
సమావేశానికి గైర్హాజరైన కౌన్సిలర్లు
సంగారెడి టౌన్, మార్చి7 : నెలరోజులుగా సంగారెడ్డి మున్సిపాలిటీలో వేడెక్కిన అవిశ్వాస రాజయకీయానికి తెరపడింది. మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మీరవికి పదవీ గండం తప్పింది. సొంత పార్టీ కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటించిగా.. గురువారం ఉదయం ఆర్డీవో వసంతకుమారి, మున్సిపల్ కమిషనర్ సురే్‌షపవార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు ఎవరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని మధ్యాహ్నం 3గంటలకు వాయిదా వేశారు. అప్పుడు కూడా కౌన్సిలర్లు గైర్హాజరవడంతో చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో వసంత కుమారి ప్రకటించారు.
బజారునపడ్డ బీఆర్‌ఎస్ విభేదాలు
సంగారెడ్డి మున్సిపల్‌లో సంవత్సరం క్రితం బీఆర్‌ఎ్‌సలో ఏర్పడ్డ గ్రూపు తగాదాలు అవిశ్వాస తీర్మానంతో బజారున పడ్డాయి. మున్సిపల్‌లో మొత్తం 37 వార్డులుండగా 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 18, కాంగ్రెస్ 11, బీజేపీ నుంచి ముగ్గురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన బొంగుల విజయలక్ష్మిని చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. తదనంతరం బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. చైర్‌పర్సన్ బొంగుల విజయల క్ష్మిపై అవిశ్వాసం ప్రకటిస్తూ నెలరోజుల క్రితం 24 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. బీఆర్‌ఎ్‌సలో ఐదుగురు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు మద్దతుగా నిలవగా, 13 మంది కౌన్సిలర్లు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. అవిశ్వాసం నుంచి గట్టెక్కేందుకు చైర్‌పర్సన్ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్ల మద్దతు తీసుకున్నారు. మొత్తంగా 20 మందిని వారం రోజులుగా విహారయాత్రకు తరలించారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన వైస్‌చైర్‌పర్సన్ లతా విజయేందర్‌రెడ్డితో పాటు చైర్‌పర్సన్ పదవిని ఆశించిన మంజులత నాగరాజ్‌గౌడ్ 15 మంది కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహించారు. అయితే, చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గాలంటే 26 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం కాగా మెజార్టీ లేకపోవడంతో వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యారు.
బీఆర్‌ఎస్‌కు మున్సిపల్ చైర్‌పర్సన్ గుడ్‌బై?
సంగారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి బీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మొదట్లో జగ్గారెడ్డి అనుచరురాలిగా ఉన్న బొంగుల విజయలక్ష్మి 2004లో టీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం జగ్గారెడ్డితోపాటు కాంగ్రె్‌సలోకి వెళ్లారు. 2014లో కాంగ్రెస్ తరఫున గెలిచి మరోసారి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 2016 టీఆర్‌ఎ్‌సలో చేరారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచి మూడోసారి చైర్‌పర్సన్ అయ్యారు. కానీ ప్రస్తుతం సొంత పార్టీలో గ్రూపు తగాదాలు ఏర్పడి అవిశ్వాసానికి దారి తీయడంతో చైర్‌పర్సన్ దంపతులు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.