Share News

పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:47 PM

జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి

పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలి
అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ మనుచౌదరి

సిద్దిపేట అగ్రికల్చర్‌, జూలై 22: గ్రామాల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవితో కలిసి డివిజనల్‌ పంచాయతీ అధికారులు, ఎంపీవోలతో సమావేశం నిర్వహించి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా తాగునీరు క్లోరినేషన్‌ చేయించాలని, డెంగీ వ్యాధిని నిరోధించేందుకు దోమలు పెరగకుండా ప్రతీ గ్రామంలో వారానికి రెండుసార్లు ఫాగింగ్‌ చేయించాలని, నిలువ నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయాలని అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు వారానికి రెండు రోజులు ఆయా మండలాలలోని గ్రామాలను తప్పకుండా సందర్శించి పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని అన్నారు. కార్యక్రమంలో డివిజనల్‌ పంచాయతీ అధికారులు మల్లికార్జున్‌, లతా, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రాన్స్‌జెండర్ల ఉపాధి కల్పనకు..

ట్రాన్‌జెండర్ల ఉపాధి కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్‌ స్విచ్‌ ఎకో సంస్థ ప్రతినిధి అక్షయ్‌ నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ... తమకాళ్లపై తాము నిలబడేందుకు ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఇష్టమైన రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. డీఆర్డీఏ ద్వారా కూడా పాడి ఆవుల పెంపకం, పౌలీ్ట్రఫామ్‌, క్యాంటీన్‌ నిర్వహణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, బ్యూటీ పార్లర్‌, మిల్క్‌పార్లర్‌ లాంటి యూనిట్ల ద్వారా అవకాశాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 11:47 PM