శోభాయమానం.. శ్రావణమాసం
ABN , Publish Date - Aug 03 , 2024 | 10:56 PM
కొండపాక, ఆగస్టు 3: సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు మనది. తెలుగు నెలల్లో ప్రతినెలా ఏదో ఒక ప్రత్యేకతను చెబుతుంది. అలాంటి దాంట్లో శ్రావణమాసం ఒకటి.
సకల సౌభాగ్యలందించే శ్రావణం రేపటి నుంచే ప్రారంభం
నెలపాటు ఆధ్యాత్మిక వాతావరణం
పూజలు, పునస్కారాలు, వ్రతాలకు ఈ నెల పెట్టిందిపేరు
కిటకిటలాడనున్న ఆలయాలు
కొండపాక, ఆగస్టు 3: సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు మనది. తెలుగు నెలల్లో ప్రతినెలా ఏదో ఒక ప్రత్యేకతను చెబుతుంది. అలాంటి దాంట్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసంలో పండుగలతో పాటు ఆలయాలు నెలరోజుల పాటు భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం సోమవారంతో ప్రారంభమవుతుంది. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో ఇది ఐదవది. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వివిధరకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే మాసంగా పెద్దలు చెబుతారు. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.
సంస్కృతి సంప్రదాయాల మాసం
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో ‘శ్రావణమాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో ముఖ్యమైనవి పండుగలు వరలక్ష్మీవ్రతం, మంగళగౌరీ వ్రతం, రాఖీపౌర్ణమి.
శివారాధనకు ఎంతో విశిష్టత
శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తారు.
మంగళ గౌరీ వ్రతం
శ్రావణమాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభిస్తారు. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం చేస్తారు.
వరలక్ష్మి వ్రతం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేస్తారు. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చని పండితులు సూచిస్తున్నారు.
రాఖీ పౌర్ణమి
శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుతారు. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవిత్రధారణ చేస్తారు. ఇవే కాసుకుండా కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్రస్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈనెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు, తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుతాయనే భావన.