సిద్దిపేట ఎవరికి పీట

ABN , First Publish Date - 2024-02-05T23:31:17+05:30 IST

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే సిద్దిపేట కాస్త ప్రత్యేకం...

సిద్దిపేట ఎవరికి పీట

హాట్‌టాపిక్‌గా పార్లమెంటు ఎన్నికలు

మూడు ఎంపీ స్థానాలతో జిల్లాకు బంధం

గత ఎన్నికల్లో మూడు పార్టీలకూ అవకాశం

ఒక్కోచోట ఒక్కో పార్టీకి మెజారిటీ

మారిన సమీకరణాలతో సర్వత్రా చర్చ

అభ్యర్థిత్వాలకు పోటీపడుతున్న ఆశావహులు

రసవత్తరంగా మెదక్‌, కరీంనగర్‌, భువనగిరి పాలిటిక్స్‌

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 5: పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే సిద్దిపేట కాస్త ప్రత్యేకం... ఈ జిల్లాలోని 26 మండలాలు మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ముగ్గురు ఎంపీలకు ప్రొటోకాల్‌ ముడిపడి ఉంది. అయితే, ప్రధాన పార్టీల నుంచి ఏ స్థానం నుంచి ఎవరెవరూ బరిలో ఉంటారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజా సమీకరణాలతో మెదక్‌తో పాటు కరీంనగర్‌, భువనగిరి పార్లమెంట్‌ స్థానాల గెలుపోటములు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాలు ఒకటి లేదా రెండు పార్లమెంట్‌ స్థానాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. కానీ సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉంటే ఇందులో 18 మండలాలు మెదక్‌ లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. మరో 4 మండలాలు కరీంనగర్‌ లోక్‌సభ పరిధి, ఇంకో 4 మండలాలు భువనగిరి పరిధిలో ఉన్నాయి. ఫలితంగా ఆయా రాజకీయ పార్టీల బలాబలాలు, పరిణామాలు జిల్లాపై ప్రభావం చూపించనున్నాయి.

మూడు పార్టీలకు మూడు సీట్లు

గత లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఒకే జిల్లాలో ఉంటూ సిద్దిపేట జిల్లా ప్రజలు వినూత్నమైన తీర్పునివ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నాటి ఎన్నికల్లో మెదక్‌ ఎంపీగా పోటీచేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. అదేవిధంగా కరీంనగర్‌లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన బండి సంజయ్‌ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌, మాజీఎంపీ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉన్న పొన్నం ప్రభాకర్‌ మీద పైచేయి సాధించడం సంచలనం సృష్టించింది. ఇక భువనగిరిలో కాంగ్రెస్‌ తరఫున పోటీలో నిలిచిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఈ జిల్లాకు సంబంధించిన మండలాలే అండగా నిలిచాయి. దీంతో ఆయన కూడా విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రె్‌సకు తలా ఒక సీటు దక్కింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న సిద్దిపేట ప్రాంతాన గత పార్లమెంట్‌ ఎన్నికల మూలాన కాంగ్రెస్‌, బీజేపీలు పాగా వేశాయి. జిల్లా ప్రజాప్రతినిధుల జాబితాలో ఆ రెండు పార్టీలకూ చోటు దక్కాయి.

రెండు సిట్టింగ్‌ స్థానాల్లో మార్పు

మెదక్‌ పార్లమెంట్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి తాజా ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగి భారీ మెజారిటీని సాధించారు. ఎంపీ పదవికి రాజీనామా సైతం సమర్పించారు. ఫలితంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం మారనున్నది. అదేవిధంగా భువనగిరి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిచి గెలుపొందారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిత్వానికీ తీవ్ర పోటీ నెలకొన్నది. మెదక్‌, భువనగిరి రెండుస్థానాల్లోనూ సిట్టింగ్‌ ఎంపీలు అసెంబ్లీ బాట పట్టడంతో మార్పు తథ్యమైంది. అలాగే కరీంనగర్‌ సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ సైతం కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. లేదంటే ఇక్కడ కూడా సిట్టింగ్‌ స్థానంలో మార్పు జరిగే అవకాశాలు ఉండేది.

తెరపైకి ఆశావహులు

మెదక్‌, భువనగిరి, కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీలు ఇప్పటిదాకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీఆర్‌ఎస్‌ లోక్‌సభ వారీగా సమావేశాలను నిర్వహించి అభ్యర్థులకు సంబంధించి అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బీజేపీ సైతం అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థిత్వాలకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

మెదక్‌ బీఆర్‌ఎస్‌ రేసులో మాజీ కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మరో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్లు చర్చకు వసున్నాయి. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పేర్లు ప్రచారం అవుతున్నాయి.

కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ పేరు దాదాపు ఖాయమైనట్లేనన్న వాదన వినిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేరు ఖరారైనట్లుగా ఆ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన పొన్నం ప్రభాకర్‌ ప్రస్తుతం హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థిపై ఇంకా అస్పష్ఠత నెలకొన్నది.

భువనగిరిలో బీఆర్‌ఎస్‌ తరఫున జిల్లా బాలకృష్ణారెడ్డి, అమరేందర్‌, దూదిమెట్ల బాలరాజు, ఇతరాత్ర నేతలు టికెట్‌ ఆశిస్తున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో పాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్‌ నుంచి ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.

Updated Date - 2024-02-05T23:31:18+05:30 IST