నిఘా నీడలో స్ట్రాంగ్‌రూంలు
ABN , Publish Date - May 14 , 2024 | 11:45 PM
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, నర్సాపూర్, గజ్వేల్, మెదక్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భారీ భద్రత మధ్య నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ర్టాంగ్ రూముల్లో భద్రపరిచి సీల్ వేశారు
జూన్ 4 వరకు కట్టుదిట్టమైన భద్రత
సమష్టి కృషితో ఎన్నికలు విజయవంతం
ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్
నర్సాపూర్/మెదక్ అర్బన్ మే 14: మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, నర్సాపూర్, గజ్వేల్, మెదక్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భారీ భద్రత మధ్య నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీలో, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ర్టాంగ్ రూముల్లో భద్రపరిచి సీల్ వేశారు. జూన్ 4 వరకు మూడెంచల భద్రత ఉండనుంది. మంగళవారం స్ర్టాంగ్‌రూంలను కలెక్టర్ మెదక్ రాహుల్‌రాజ్, ఎస్పీ బాలస్వామి, తదితరులు పరిశీలించి స్థానిక అధికారులకు పలుసూచనలు చేశారు. అనుమతి లేకుండా ఒక్కరు కూడా లోనికి వెళ్లకూడదని సూచించారు. స్ర్టాంగ్‌రూంల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా స్ర్టాంగ్‌రూంల వద్ద ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 84.25 శాతం నమోదు కాగా అత్యల్పంగా పటాన్‌చెరు నియోజకవర్గం నమోదైనట్లు చెప్పారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి నాలుగుశాతం ఓటింగ్ పెరిగిందని తెలిపారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు, నియోజకవర్గాల ఏఆర్‌వోలు, డీఎస్పీలు తదితరులు ఉన్నారు.
ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిది : కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటీ నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహకారం, భాగస్వామ్యం మరువలేనిదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఎలాంటి విఘాతం కలగకుండా జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఎండలను సైతం లెక్కచేయక తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారన్నారు.
స్ర్టాంగ్‌రూంలను పరిశీలించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో పాటు రాష్ట్రకార్యవర్గ సభ్యుడు మురళిధర్‌యాదవ్, పలువురు బీవీఆర్‌ఐటీలోని స్ర్టాంగ్‌రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డితో భద్రత ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.