Share News

సిద్ధమవుతున్న గణనాథులు

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:11 PM

నారాయణఖేడ్‌, ఆగస్టు 24: వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండడంతో ఉత్సవాల కోసం ప్రతిష్టించడానికి వినాయక విగ్రహాలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు. వినాయక పండుగ వచ్చిందంటే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో సైతం పోటీ పడి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు.

సిద్ధమవుతున్న గణనాథులు
నారాయణఖేడ్‌లో విక్రయానికి ఉంచిన వినాయక విగ్రహాలు

ఆధునిక డిజైన్లతో ఆకట్టుకునే విధంగా తయారీ

ఖేడ్‌లో 12 అడుగుల వరకు అందుబాటులో..

రూ.2 వేల నుంచి రూ.30 వేల వరకు ఉన్న ప్రతిమల ధరలు

ఇప్పటికీ అడ్వాన్స్‌లు ఇచ్చి వెళ్తున్న నిర్వాహకులు

నారాయణఖేడ్‌, ఆగస్టు 24: వినాయక చవితి పర్వదినం సమీపిస్తుండడంతో ఉత్సవాల కోసం ప్రతిష్టించడానికి వినాయక విగ్రహాలను విక్రయదారులు అందుబాటులో ఉంచారు. వినాయక పండుగ వచ్చిందంటే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో సైతం పోటీ పడి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో.. స్వాతంత్య్ర పోరాట సమయంలో బాలగంగాధర్‌ తిలక్‌ పిలుపుతో వినాయక ఉత్సవాలను సామూహికంగా నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వినాయక మండపాలు పెరుగుతూనే ఉన్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు గతంలో హైదరాబాద్‌, నిజామాబాద్‌ ప్రాంతాల నుంచి విగ్రహాలను తెచ్చుకునేవారు. ప్రస్తుతం పోటీపడి విగ్రహాలను ఏర్పాటు చేస్తుండడంతో గత ఐదారేళ్లుగా రాజస్థాన్‌ కళాకారులతో కొందరు వినాయక ప్రతిమలను తయారు చేయించి విక్రయిస్తున్నారు. మరికొందరు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి.. ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో 20 వరకు విగ్రహాల దుకాణాలు వెలిశాయి. దాదాపు రెండు ఫీట్ల నుంచి 12 ఫీట్ల ఎత్తు గల విగ్రహాలు వివిధరకాలలో సిద్ధంగా ఉన్నాయి. విగ్రహం డిజైన్‌ను బట్టి రూ.2 వేల నుండి రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు తమకు అవసరమైన విగ్రహాలను విక్రయదారుల వద్ద ఎంపిక చేసుకొని అడ్వాన్సులు ఇచ్చి వెళ్తున్నారు. పండుగ రోజున వాటిని తమతమ గ్రామాలకు తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఖేడ్‌ డివిజన్‌లో 1000 మండపాలు

నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో దాదాపు 1000 వరకు మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల వల్ల పర్యావరణ సమస్య తలెత్తుతుందని భావించేవారి కోసం మట్టి గణపతులను కూడా విక్రయిస్తున్నారు. ఈ మట్టి వినాయకులు 2 నుంచి 4 అడుగుల వరకు లభిస్తున్నాయి. ఈ విగ్రహాలు రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు అందుబాటులో ఉన్నాయి. వినాయక చవితి సమీపిస్తుండడంతో విగ్రహాల విక్రయాల దుకాణాల వద్ద సందడి నెలకొంది. విగ్రహాల విక్రయదారుడు నీలే్‌షను ప్రశ్నించగా, తాము మహారాష్ట్ర నుంచి విగ్రహాలను విక్రయానికి తీసుకొచ్చామన్నాడు. తమ వద్ద 4 నుంచి 10 ఫీట్ల వరకు వంద విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాడు. గతంలో విగ్రహాలను ఇతర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు ఓర్చి తెచ్చుకునేవారమని, ప్రస్తుతం తాము స్థానికంగానే అందుబాటులో ఉంచడంతో ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బంది లేకుండా ఉంది.

Updated Date - Aug 24 , 2024 | 11:11 PM