మూగజీవాల మృత్యుఘోష
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:35 PM
జిన్నారం, ఆగస్టు 21: జిన్నారం మండల పారిశ్రామికవాడల్లో పరిశ్రమల రసాయన వ్యర్థ జలాలు మూగజీవాల పాలిట మృత్యు జలాలుగా మారాయి.
పాడిగేదెలు, మేకల ప్రాణాలు తీసుస్తున్న కాలుష్య జలాలు
15 రోజల వ్యవధిలో ఎనిమిది గేదెలు మృతి
ఆర్థికంగా నష్టపోతున్న రైతులు
చోద్యం చూస్తున్న పీసీబీ అధికారులు
జిన్నారం, ఆగస్టు 21: జిన్నారం మండల పారిశ్రామికవాడల్లో పరిశ్రమల రసాయన వ్యర్థ జలాలు మూగజీవాల పాలిట మృత్యు జలాలుగా మారాయి. నోరు లేని మూగజీవాలైన పాడి గేదెలు, మేకలు కలుషిత జలాలు తాగి మృత్యువాత పడుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో గడ్డపోతారం, కాజీపల్లి గ్రామాల్లో పాడి గేదెలు కాలుష్య జలాలు తాగి మరణిచంగా.. వాటిపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిశ్రమల ధన దాహంతో బహిరంగ ప్రాంతాలకు వ్యర్థ రసాయనాలు వదిలేయగా చెరువులు, కుంటల్లో చేరిన కలుషిత నీటిని తాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని గడ్డపోతారం, కాజీపల్లి, బొల్లారం ప్రాంతాల్లో తరచూ కాలుష్య రసాయన వ్యర్థాలు తాగి మూగజీవాలు మరణిస్తున్నాయి. పరిశ్రమలు నిత్యం బహిరంగ ప్రాంతాల్లో రసాయన జలాలు వదిలేయగా.. మేత కోసం వెళ్లే జీవిలు దాహం తీర్చుకునేందుకు వాటిని తాగి మరణిస్తున్నాయి. మూడు దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఈ సమస్య నెలకొన్నది. ఇటీవల కురుస్తున్న వర్షపు నీటిలో కొన్ని పరిశ్రమలు వ్యర్థాలను వదిలేయగా.. ఇటీవల కాజీపల్లికి చెందిన ఇద్దరు రైతులకు చెందిన మూడు పాడిగేదెలు మరణించాయి. ఈ నెల 20 గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లికి చెందిన యువ రైతు బసెట్టి సాయికుమార్‌కు చెందిన రెండు పాడిగేదెలు మరణిచగా, 21న మూడు పాడిగేదెలు మృత్యువాత పడగా.. మరో నాలుగు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. కాగా పరిశ్రమల నిర్లక్ష్యంతో నీటి వనరులు కలుషితమై మూగజీవాలు తరచూ మరణిస్తున్నాయని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. పారిశ్రామికవాడల సమీపంలోని గ్రామాల జలాశయాలు పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుని అందులోని నీరు సహ భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. ఇక పాడి గేదెల పోషణతో జీవనం సాగిస్తున్న చాలామంది ఈ ప్రాంత రైతులకు వ్యర్థ జలాలతో నష్టం కలుగుతున్నది. కాలుష్య సమస్యను పరిష్కరించాల్సిన పీసీబీ అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది.
పాడిగేదెల మృతితో రూ.7 లక్షల నష్టం
పాడిగేదెల పోషణపై ఆధారపడి జీవిస్తున్న తమకు పరిశ్రమల నుంచి వ్యర్థ రసాయనాలతో తీవ్ర నష్టం కలుగుతుందని బాధిత రైతు బసెట్టిగారి సాయికుమార్ అన్నాడు. రెండురోజుల వ్యవధిలో తన ఐదు గేదెలు మృతిచెందగా.. మరో 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని ఆవేదన చెందాడు. మృతిచెందిన ఐదు పాడిగేదెల విలువ రూ.7 లక్షల వరకు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని, జలాశయాల్లోకి రసాయన వ్యర్థాల ప్రవాహాన్ని నియంత్రించాలని కోరాడు.
పీసీబీ కార్యాలయం ఎదుట కిష్టయ్యపల్లివాసుల ధర్నా
జిన్నారం, ఆగస్టు 22: పరిశ్రమల కాలుష్య జలాలు తాగి, ఒకే రైతుకు చెందిన ఐదు గేదెలు మరణించడంతో ఆగ్రహం చెందిన కిష్టయ్యపల్లి వాసులు సనత్‌నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యాలయం ఎదుట మృతిచెందిన గేదెలతో ధర్నా నిర్వహించారు. గడ్డపోతారం పంచాయతీ కిష్టయ్యపల్లి గ్రామానికి చెందిన యువరైతు బాశెట్టి సాయికుమార్ పాడిగేదెలు మంగళవారం మేతకు వెళ్లి రసాయన వ్యర్థ జలాలు తాగి రెండు మృతిచెందగా.. బుధవారం మరో మూడు మృతిచెందాయి. మరో నాలుగు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత రైతు కుటుంబం, స్థానిక నాయకులు మృతిచెందిన పాడిగేదెల మృతదేహాలతో తరలివెళ్లి పీసీబీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా కాలుష్య జలాలను బహిరంగ ప్రాంతాలకు వదిలి వేయడంతో జలాశయాలు కలుషితమవుతున్నాయని ఆందోళన చేశారు. మూగజీవాలు మేతకు వెళ్లి కలుషిత జలాలు పడుతున్నాయని, ఇందుకు బాధ్యులైన పరిశ్రమలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సాయికుమార్‌కు గేదెల మృతితో రూ.7 లక్షల నష్ట వచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పీసీబీ అధికారులు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ప్రకాశంచారి, నీరుడి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బాశెట్టి రాజు, నాయకులు పెంటేష్, వేణు, కుమార్, మాజీ వార్డుసభ్యులు, మహిళలు పాల్గొన్నారు.