Share News

వరాల తల్లి.. విద్యా సరస్వతీ అమ్మవారు

ABN , Publish Date - Aug 16 , 2024 | 11:09 PM

వర్గల్‌, ఆగస్టు 16: వర్గల్‌ కేంద్రంలోని శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో మూలమహోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు.

వరాల తల్లి.. విద్యా సరస్వతీ అమ్మవారు
ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను సన్మానిస్తున్న వేదపండితులు

వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో వైభవంగా మూలమహోత్సవం

వరలక్ష్మి అలంకరణలో అమ్మవారు

వేడుకలకు తరలివచ్చిన వేలాధిమంది భక్తులు

భక్తిపారవశ్యమైన క్షేత్రం

వర్గల్‌, ఆగస్టు 16: వర్గల్‌ కేంద్రంలోని శంభుగిరి కొండలపై వెలసిన విద్యాధరి క్షేత్రంలో మూలమహోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా విద్యాసరస్వతీ అమ్మవారు శ్రీవరలక్ష్మి అలంకణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవరలక్ష్మి, మూలనక్షత్రం ఒకేరోజు రావడంతో విద్యాధరి క్షేత్రానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ వ్యవస్థాపకుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలతో పాటు పూజలు నిర్వహించారు. పూజల అనంతరం శ్రీవరలక్ష్మి అలంకరణలో విద్యాసరస్వతీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక వేడుకల సందర్భంగా విద్యాధరి క్షేత్రంలో వందల సంఖ్యలో చిన్నారులకు అక్షర స్వీకారాలు చేశారు. మూల సందర్భంగా ఆలయంలో చండీహోమం, అమ్మవారికి లక్ష పుష్పార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాభివృద్ధికి కృషిచేస్తున్న దాతలను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. వేడుకలకు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా ప్రసాదాలను అందజేశారు. వేడుకల సందర్భంగా క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. శంభుగిరి కొండలు భక్తిపారవశ్యమైనాయి.

నాచగిరి క్షేత్రంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

వర్గల్‌, ఆగస్టు 16: జిల్లాలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ మండలం నాచారం నాచగిరి లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ యాగశాలలో వేదపండితులు హోమాధి కార్యక్రమాలు జరిపారు. శ్రావణమాసం సందర్భంగా ఆలయ మండపంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. వేడుకలకు భక్తులు అధికంగా తరలివచ్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అన్నపూర్ణ పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. వేడుకల సందర్భంగా నాచగిరి పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.

Updated Date - Aug 16 , 2024 | 11:09 PM