సకాలంలో కుటుంబ నిర్ధారణ సర్వేను పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:08 PM
కోహీర్, ఆగస్టు 28: రెండు లక్షల రుణమాఫీ కానీ రైతుల కుటుంబ నిర్ధారణ ఇంటింటి సర్వేను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్
కవేలిలో కుటుంబ నిర్ధారణ ఇంటింటి సర్వే పరిశీలన
కోహీర్, ఆగస్టు 28: రెండు లక్షల రుణమాఫీ కానీ రైతుల కుటుంబ నిర్ధారణ ఇంటింటి సర్వేను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. బుధవారం కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో మండల వ్యవసాయశాఖ అధికారి నవీన్‌కుమార్ నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను డీఏవో పరిశీలించి మాట్లాడారు. రూ.2 లక్షలలోపు రుణమాఫీ కాని రైతుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన రైతుభరోసా, పంట రుణమాఫీ యాప్‌లో పొందుపర్చాలన్నారు. రుణమాఫీ కాని రైతుల కుటుంబ నిర్ధారణ సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల ఆధార్‌తో పాటు భూమి సర్వే నంబరు లోన్ ఖాతా వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. అంతేకాకుండా ఈ సర్వేను డివిజన్ వ్యవసాయ అధికారి ఎప్పటికప్పుడు పరిశీలించాలని డీఏవోను ఆదేశించారు. రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్నారు. అనంతరం పలువురు రైతులతో డీఏవో మాట్లాడారు. ఆయన వెంట ఏడీఏ బిక్షపతి, మండల ఏవో నవీన్‌కుమార్, ఏఈవో శ్రీనివాస్, రైతులు తదితరులు ఉన్నారు.
ఏవోకు మాత్రమే లాగిన్‌తో సర్వేకు ఆలస్యం
కోహీర్ మండలంలో చాలామంది రైతులకు రెండు లక్షల రూపు రుణమాఫీ కాలేదు. ఇందుకు సంబంధించి రైతులు ఆయా రైతువేదికల వద్ద వ్యవసాయ శాఖ విస్తీర్ణ అధికారుల వద్దకు దరఖాస్తులు పట్టుకుని నిత్యం తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ రాలేనందున ఆ రైతులకు తిరిగి రుణమాఫీ అందించేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. రైతుల వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో పొందుపరిచేందుకు మండల వ్యవసాయ అధికారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఏవోలకు మాత్రమే లాగిన్ ఉండడం వల్ల అందరి వివరాలు ఒకరే చేయాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్నది. అంతేకాకుండా సకాలంలో సర్వే పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. క్లస్టర్ వారీగా క్లస్టర్ ఏవోలకు లాగిన్ ఐడీలు ఇస్తే సర్వే తొందరగా పూర్తవుతుందని పలువు రైతులు పేర్కొన్నారు.