తిగుల్‌లో గ్రామ కంఠం భూమి కబ్జా
ABN , Publish Date - Jul 29 , 2024 | 11:00 PM
జగదేవ్‌పూర్, జూలై 29: జగదేవ్‌పూర్ మండలం తిగుల్‌లో గ్రామ కంఠం భూమి కబ్జాకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు, గ్రామస్థులు సోమవారం కబ్జాకు గురైన స్థలం వద్దకు వెళ్లి కబ్జాదారుడు మహే్‌షను నిలదీశారు.
నిలదీసిన కాలనీవాసులు
జగదేవ్‌పూర్, జూలై 29: జగదేవ్‌పూర్ మండలం తిగుల్‌లో గ్రామ కంఠం భూమి కబ్జాకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు, గ్రామస్థులు సోమవారం కబ్జాకు గురైన స్థలం వద్దకు వెళ్లి కబ్జాదారుడు మహే్‌షను నిలదీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1982లో అప్పటి ప్రభుత్వం దళితులకు ఇళ్లస్థలాల కోసం సర్వే నంబరు 768, 769లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్లు లేని పేదలకు పంపిణీ చేసిందన్నారు. అలాగే నాలుగు గుంటల స్థలాన్ని కమ్యూనిటీ భవనం కోసం కేటాయించిందని తెలిపారు. ఆ స్థలాన్ని ఓ వ్యక్తి రెండేళ్ల నుంచి ఆక్రమించుకుని ఇసుక దందా నిర్వహిస్తున్నాడని వాపోయారు. ఇటీవల ఆ స్థలం అసైన్‌మెంట్ నంబరు తప్పుడుగా చూపించి, పత్రాలు సృష్టించి గ్రామపంచాయతీ కార్యదర్శి ద్వారా మ్యూటేషన్ చేయించుకున్నారని వివరించారు. ఈ విషయంపై కార్యదర్శిని అడగ్గా తనకు తెలియదని పొంతనలేని సమాధానం చెప్పారని పేర్కొన్నారు. స్థలాన్ని కబ్జాచేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, గ్రామ కంఠం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రామస్వామి, రామ మల్లయ్య, నాగరాజు, మల్లేశం, అంజనేయులు, నర్సయ్య, పరశురామ్, మహేందర్, ఉపేందర్ పాల్గొన్నారు.