పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరిస్తాం
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:38 PM
అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్
కొండపాక, సెప్టెంబరు 3: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని అదనపు కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, వంట సామగ్రిని పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మెనూ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న పాముల పుట్టను చూసి ఇది విద్యార్థులకు అత్యంత ప్రమాదకరమని, వెంటనే తొలగించాలని ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని కోరగా పాఠశాలలో కోతుల బెడద, పాములు గదుల్లోకి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. అదేవిధంగా స్నానాలకు వేడి నీరు అందించే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో వాలీబాల్ తదితర ఆట వస్తువులు లేవని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన అదనపు కలెక్టర్ వాలీబాల్ కిట్ పంపిస్తానని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. వైద్యశాఖను ఉద్దేశించి మాట్లాడుతూ.. సిబ్బంది గ్రామాలకు వెళ్లి జ్వర సర్వే నిర్వహించాలని, జ్వరంతో బాధపడుతున్న వారిరక్త నమూనాలు సేకరించి చికిత్స అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివా్‌సరెడ్డి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి, కేజీవీబీ ప్రిన్సిపాల్ గౌతమి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆనంద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, ఎంపీడీవో, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శ్రీకాంత్, వైద్యాధికారి శ్రీధర్ తదితరులున్నారు.