వీరభద్రస్వామి ఆలయ పాలకవర్గం ఏర్పాటెప్పుడో?
ABN , Publish Date - Aug 28 , 2024 | 11:12 PM
గుమ్మడిదల, ఆగస్టు 28: భక్తులకు కొంగు బంగారమైన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెం వీరభద్రస్వామి ఆలయ నిర్వహణకు పాలకవర్గం ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొన్నది.
ఎటూ తేల్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం
కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశవహులు ఎదురుచూపులు
గుమ్మడిదల, ఆగస్టు 28: భక్తులకు కొంగు బంగారమైన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి వీరన్నగూడెం వీరభద్రస్వామి ఆలయ నిర్వహణకు పాలకవర్గం ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆరునెలలు దాటినా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆలయశాఖ నోటిఫికేషన్ ఇచ్చినా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దయినట్లు అధికారులు తెలిపారు. దీంతో పాలకవర్గం ఏర్పాటు ప్రక్రియ మొదటికొచ్చింది. దీంతో ఆశవహులు నిరాశకు గురవుతున్నారు. కాగా ఆలయ చైర్మన్ పదవి కోసం ఆశవహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఈ ఆలయ కమిటీ ఏర్పాటుపై మండల నాయకులతో అధిష్టానం చర్చించినట్లు సమాచారం. జిల్లాలోని శైవక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన బొంతపల్లి వీరన్న వీరభద్రస్వామి ఆలయం అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలంటే చైర్మన్ పదవికి ఎవరు సమర్థుడు అనే కోణంలో చర్చించి.. వారి పేరు ఇవ్వాలని మండల నాయకులతో చెప్పినట్లు సమాచారం. మండల నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఏకతాటిపై ఓ మండల యువ నాయకుడి పేరు ప్రతిపాదించి అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. కాగా చైర్మన్ పదవి స్థానిక బొంతపల్లి గ్రామానికి చెందినవారికే ఇవ్వాలని కొందరు సీనియర్ నాయకులు వాదిస్తున్నారు. మెజార్టీ నాయకులంతా పక్క గ్రామానికి చెందిన ఆ యువకుడి పేరే ప్రతిపాదన చేయడంతో పాలకవర్గానికి పోటీలేదు. అధిష్టానం పాలకవర్గాన్ని ప్రకటించడమే ఆలస్యమని భావించారు. పాలకవర్గ ప్రక్రియ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. దీంతో ఆశవహులు నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ముగిసి రెండునెలలు గడిచినా.. ఇప్పటికీ ఆలయ పాలకవర్గం ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించలేదు. కాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా కాంగ్రె్‌సలో చేరిపోవడంతో పాలకవర్గం ఏర్పాటు తొందర్లో జరుగుతుందని పలువురు ఎదురుచూస్తున్నారు. కాంగ్రె్‌సలో కష్టపడిన కార్యకర్తలకే పదవులు వస్తాయని ఎమ్మెల్యే సైతం చెప్పడం మండల సీనియర్ నాయకుల్లో సంతృప్తినిచ్చింది. దీంతో గతంలో ప్రతిపాదించిన ఆ యువ నాయకుడికే ఆలయ కమిటీ చైర్మన్ పదవి దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా డైరెక్టర్ పదవులు కూడా పార్టీ కోసం పదేళ్లు కష్టపడిన వారికే దక్కనున్నాయి.