దిగ్బంధం చెర వీడేదెప్పుడు..?
ABN , Publish Date - Jul 20 , 2024 | 11:46 PM
గుమ్మడిదల, జూలై 20: ఆ ఊరు పదేళ్లుగా నిర్బంధంలో ఉన్నది. పరిహారం అందక.. న్యాయం జరగక.. కోర్టు స్టేతో గ్రామంలోని ప్రజలు ఆంక్షల మధ్య బతుకుతున్నారు. చుట్టూ కంచె.. ఊరిలోకి వెళ్లాలన్నా.. బంధువులు రావాలన్నా.. అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే.
పదేళ్లుగా పహారాలోనే ఆ ఊరి బతుకులు
బంధువులు రావాలన్నా అనుమతి తప్పనిసరి
పరిహారం కోసం ఏళ్లుగా పడిగాపులు
పాలకుల చెవికెక్కని గోడు
ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని గ్రామస్థుల వేడుకోలు
గుమ్మడిదల, జూలై 20: ఆ ఊరు పదేళ్లుగా నిర్బంధంలో ఉన్నది. పరిహారం అందక.. న్యాయం జరగక.. కోర్టు స్టేతో గ్రామంలోని ప్రజలు ఆంక్షల మధ్య బతుకుతున్నారు. చుట్టూ కంచె.. ఊరిలోకి వెళ్లాలన్నా.. బంధువులు రావాలన్నా.. అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న గ్రామమే దార్గుల్ల. తమ సమస్య పరిష్కరించాలని గొంతెత్తినా పాలకుల చెవికి ఎక్కడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోని న్యాయం చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని దార్గుల్ల, దాచారం గ్రామాలను దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కలిపేందుకు కొన్నేళ్ల క్రితం అధికారులు సర్వేచేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించారు. కానీ కొన్ని మిగులు భూములకు, ఇళ్లకు పరిహారం అందించలేదు. దీంతో కొన్నేళ్లుగా ఆయా భూముల్లో రెండు గ్రామాలవారు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. కానీ 2009లో ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఒక అడుగు ముందుకేసి విస్తీర్ణ పనుల్లో వేగం పెంచారు. ఆ రెండు గ్రామాలను లోపలికి కలుపుకుంటూ చుట్టూ ప్రహరీ నిర్మించారు. గేటు కూడా నిర్మిస్తుండగా రెండు గ్రామాల ప్రజలు పరిహారం అందలేదని ఆందోళన చేశారు. వారి కోరిక మేరకు గేటు నుంచి గ్రామాలకు వెళ్లే విధంగా అనుమతి ఇచ్చారు. 2015 దాచారం గ్రామానికి చెందిన గ్రామస్థులకు జిన్నారం మండలం కిష్టయ్య పల్లెలోని ప్రభుత్వ భూముల్లో ఇళ్లపట్టాలు ఇచ్చి.. బలవంతంగా ఊరిని ఖాళీ చేయించారు. దీంతో ఆ గ్రామస్థులు గత్యంతరం లేక తమ కేటాయించిన ఇళ్లల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా రేకుల షెడ్లు వేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
మేం ఖాళీ చేయం
దార్గుల్ల గ్రామంలోని 120 ఎకరాల భూములకు సంబంధించి తగిన పరిహారం అందలేదని, పరిహారం అందించేవరకూ ఖాళీ చేసేది లేదంటూ గ్రామస్థులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ గ్రామస్థులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని స్టే ఇవ్వడంతో అన్నారం ఎయిర్‌ఫోర్స్ అకాడమీ అధికారులు దార్గుల్ల గ్రామంలోనే ఉండేవిధంగా వెసులుబాటు కల్పించారు. దీంతో ఊరిలోనే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. దాదాపు 50 ఇళ్లు, 300 మందికిపైగా జనాభా కలిగిన దార్గుల్ల గ్రామంలోని ప్రజలు ఇప్పటివరకూ స్టేపైన నివాసముంటున్నారు. పదేళ్లు గడుస్తున్నా పరిహారం అందలేదని, ప్రహరీ మధ్యనే తమ బతుకులు సాగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎవరైనా బంధువులు ఇక్కడి రావాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా.. షరతులతో కూడిన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు.
ఎమ్మెల్యే గారూ.. పట్టించుకోండి
ఎన్నోఏళ్ల నుంచి దార్గుల్ల, దాచారం గ్రామస్థులు పరిహారం కోసం పోరాటం చేస్తున్నా ఫలితం దక్కలేదని, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పట్టించుకోని మా సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. శనివారం గుమ్మడిదలలో వారు విలేకరులతో మాట్లాడారు. రెంగు గ్రామాల్లోని మిగులు భూములకు పదేళ్లవుతున్నా పరిహారం రాలేదన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్‌రెడ్డి తమ సమస్య పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. మూడోసారి గెలిచి ప్రస్తుతం అధికార పార్టీలో కొనసాగుతున్న మహిపాల్‌రెడ్డి గారు స్పందించి దార్గుల్ల, దాచారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎయిర్‌ఫోర్స్, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి, తమ భూములకు మార్కెట్‌తో కూడిన ధరలు అందించే విధంగా కృషి చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దార్గుల గ్రామానికి చెందిన తుమ్మ సుధాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, గ్రామస్థులు మహేష్ సంతోష్, బాజ్‌రెడి,్డ మిల్కరెడ్డి పాల్గొన్నారు.