దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ పీఠం ఎవరికి దక్కేనో?
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:02 AM
చైర్మన్ రేసులో 8 మంది
దౌల్తాబాద్, జూలై 21: ఎమ్మెల్యే హోదా తర్వాత మంచి ప్రోటోకాల్, హోదా కలిగిన పదవి ఏదైనా ఉందంటే అది మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పని చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఈ సారి దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించడంతో దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. చైర్మన్ పదవి ఎంపిక అలస్యం అవుతుండడంతో నాయకుల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతున్నది. అలాగే ప్రతీసారి చైర్మన్ పదవి రాయపోల్ మండలానికి చెందిన నాయకులకే దక్కుతుండడంతో ఈసారి చైర్మన్ పదవి కోసం దౌల్తాబాద్ మండలానికి చెందిన నాయకులు చాలామంది పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఏదైమైనా చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
ఎవరికి అవకాశం కల్పిస్తారో
దౌల్తాబాద్ మండలం నుంచి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పడాల రాములు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు దశరథరెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు బండారులాలు, కాంగ్రెస్ మండల ఉపాధ్యాక్షుడు మద్దేల స్వామి, జనాగాం మాల్లారెడ్డి, రాయపోల్ మండలానికి చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లికనకయ్య, కిష్టరెడ్డి, తదితరుల పేర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ఉన్నాయని తెలుస్తున్నది. వీరందరూ కాంగ్రెస్ కోసం నిరంతరం కష్టపడి పని చేసిన వాళ్లు కావడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండ సురేఖ, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరకు శ్రీనివా్‌సరెడ్డి ఎవరికి అవకాశం కల్పిస్తారో ఉత్కంఠ నెలకొన్నది.