రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా..
ABN , Publish Date - Sep 24 , 2024 | 11:04 PM
పటాన్‌చెరు, సెప్టెంబరు 24: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.
సీఎం దృష్టికి డీలర్ల న్యాయమైన డిమాండ్లు
రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, సెప్టెంబరు 24: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన రాష్ట్ర డీలర్ల సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పౌర సరఫరాల్లో భాగంగా నిత్యావసర వస్తువుల పంపిణీలో కీలకపాత్ర పోషిస్తూ ప్రజల ఆహార భద్రతకు వారధిగా పనిచేస్తున్న డీలర్లకు అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఆరు దశాబ్దాల ఘనమైన చరిత్ర ఉన్న రేషన్ డీలర్ల సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా తనను ఎన్నుకోవడంపై కృతజ్ఞత తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యలను, హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ముఖ్యంగా ఐదువేల గౌరవ వేతనం, క్వింటాలుకు రూ.300ల కమీషన్ ఇవ్వాలన్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. డీలర్ల డిమాండ్లను పరిష్కరించిన మరుక్షణం రూ.2 లక్షలతో హైదరాబాద్‌లో సీఎంకు కృతజ్ఞత సభను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు మాట్లాడుతూ ప్రధాన సమస్యలతో పాటు రూ.10 లక్షల ఇన్సూరెన్స్, ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఎలక్ర్టానిక్ తూకం వే బ్రిడ్జీలు, మృతిచెందిన డీలర్ల కుటుంబాలకు రేషన్ దుకాణాలను కేటాయించడం తదితర డిమాండ్లను పరిష్కరిస్తే ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి విశ్వంభర్, వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన డీలర్లు పాల్గొన్నారు.