Share News

నా చివరి రక్తపు బొట్టు వరకూ మీతోనే..

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:56 PM

రామాయంపేట, ఆగస్టు 20: ‘నా చివరి రక్తపు బొట్టు వరకూ మీకోసం శ్రమిస్తా.. మీరు లేనిదో మొన్నటి ఎన్నికలో నేను గెలవలేను.. పార్టీ కార్యకర్తలే నన్ను ఆదరించారు’ అని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ అన్నారు.

నా చివరి రక్తపు బొట్టు వరకూ మీతోనే..
కృతజ్ఞత సభలో మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్‌

ఎంపీ రఘునందన్‌

దురహంకారంతోనే కేసీఆర్‌ ఓడారు

రైతులతో ఆటలాడితే రేవంత్‌కూ అదే గతి

రామాయంపేట, ఆగస్టు 20: ‘నా చివరి రక్తపు బొట్టు వరకూ మీకోసం శ్రమిస్తా.. మీరు లేనిదో మొన్నటి ఎన్నికలో నేను గెలవలేను.. పార్టీ కార్యకర్తలే నన్ను ఆదరించారు’ అని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ అన్నారు. మంగళవారం రామాయంపేట, నిజాంపేట మండలాలకు సంబంధించిన ఓటర్లకు కృతజ్ఞత సభ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే సత్తా చూపాలన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా శ్రమించిన మీరు సర్పంచ్‌, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులుగా గెలవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు, మూడు మాసాల్లో ఎన్నికల నగారా మోగనుందని, ఇందుకు మనమంతా సమాయత్తం కావాల్సి ఉందన్నారు. కాగా గత శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ దురంహకారాన్ని ప్రజలు ఓడించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీ పేర మోసం చేస్తోందన్నారు. అంతేగాక మంత్రులకు పరిపాలనా విధానంపై ఎలాంటి అవగాహన లేకుండాపోతోందని చెప్పారు. పాలన ఇలాగే కొనసాగితే కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తప్పదని రఘునందన్‌ ఘాటుగా హెచ్చరించారు. రామాయంపేట మండల పరిధి అక్కన్నపేటలో మరో రెండు రైళ్లను నిలిపేందుకు కేంద్రమంత్రికి లేఖ ఇస్తానన్నారు.

మరో బైపాస్‌ ఏర్పాటుపై హైవే అధికారులతో సమీక్ష

ఇప్పటికే ఒక బైపాస్‌ నిర్మించారు. ఇప్పుడు సంగారెడ్డి-ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణలో మరో బైపాస్‌ ఏర్పాటుపై ఎంపీ హైవే అథారిటీ అధికారులతో సమీక్షించారు. బైపాస్‌ లేకుండా రూటు వెడల్పుపై ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలని తన అభిప్రాయాన్ని అధికారుల ముందుంచారు. ఇదివరకే బైపా్‌సతో విలువైన భూములు కోల్పోయి, వ్యాపార రంగానికి నష్టం జరిగింది. ఈసారి అలాకాకుండా ఉన్న రహదారినే మరింత వెడల్పు చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ విషయంపై మరోమారు చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటే రామాయంపేట పురోభివృద్ధిలో అధిగమిస్తుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, బీజేపీ మెదక్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పంజా విజయ్‌, రాగి రాములు, వేల్ముల సిద్ధిరాములు, నిజాంపేట అధ్యక్షుడు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:56 PM