Share News

యాసంగి సాగు.. 2.05 లక్షల ఎకరాల్లో

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:04 AM

సంగారెడ్డి జిల్లాలో సాగు ప్రణాళిక ఖరారు

యాసంగి సాగు.. 2.05 లక్షల ఎకరాల్లో

వ్యవసాయాధికారుల అంచనాలు సిద్ధం

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

సంగారెడ్డి టౌన్‌, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి జిల్లాలో యాసంగి పంటల సాగుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 2.05 ల క్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగుచేస్తారని అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే సాగు పెరగనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. వానాకాలం సీజన్‌ ఆరంభంలో సరైన వర్షాలు లేకపోవడం.. చివర్లో అధిక వర్షాలతో ఆయా పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. దీంతో రైతులు యాసంగిపై ఆశలు పెట్టుకున్నారు.

15 వేల ఎకరాలు అధికం

గతేడాది యాసంగి జిల్లాలో 1,91,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈసారి సాగు విస్తీర్ణం పెరగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో 2.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేసే అవకాశాలున్నట్లు అంచనాలు సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే ఇది 15వేల ఎకరాలు అధికం. ఈసారి యాసంగిలో వరి, జొన్న, మొక్కజొన్న పంటల సాగు అత్యధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు.

అందుబాటులో విత ్తనాలు, ఎరువులు

పంటల విస్తీర్ణం అంచనాకు అనుగుణంగా అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. యూరియా 18,413 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 6,308 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 3,660 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 14,300 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్పీ 3,650 మెట్రిక్‌ టన్నులు అవసరమని ప్రతిపాదనలు తయారుచేశారు. అక్టోబరులో యూరియా 9,542 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 1901 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 612 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 4,407 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్పీ 433 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

Updated Date - Oct 21 , 2024 | 12:04 AM