Minister Damodara Rajanarsimha : ఆ నిబంధన మీరు పెట్టిందే..!
ABN , Publish Date - Aug 07 , 2024 | 04:55 AM
వైద్య విద్యలో సీట్ల భర్తీకి స్థానికత విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాజనర్సింహ కూడా ఎక్స్‌లోనే సమాధానం ఇచ్చారు.
2017లో ఇచ్చిన జీవోలోని నిబంధననే కొనసాగిస్తున్నాం
కేటీఆర్ వ్యాఖ్యలకు బదులిచ్చిన మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో సీట్ల భర్తీకి స్థానికత విషయంపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. స్థానికత విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాజనర్సింహ కూడా ఎక్స్‌లోనే సమాధానం ఇచ్చారు.
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి 2017 జూలై 5న నాటి బీఆర్‌ఎస్ సర్కారు ఇచ్చిన జీవో 114ను ప్రస్తావించారు. ఆ జీవోలో 9 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణిస్తూ చేసిన నిబంధననే జీవో 33లో చేర్చామని వెల్లడించారు. ఈ జీవోతో ఇతర రాష్ట్ర విద్యార్థులు స్థానికులు అవుతారన్న కేటీఆర్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.
బీఆర్‌ఎస్ జారీ చేసిన జీవో నంబరు 114 ప్రకారం 6 నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్ల పాటు విద్యార్థులు చదివిన ప్రాంతానికి స్థానికతను వర్తింపజేయాలన్న నిబంధనను కొనసాగించలేమని స్పష్టం చేశారు. ఆ జీవో మేరకు నాలుగేళ్లు తెలంగాణలో, మిగిలిన మూడేళ్లు ఏపీలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టం హామీలు ఈ ఏడాది జూన్ 2తో ముగిసినందున, ఆ నిబంధనను కొనసాగించబోమని మంత్రి స్పష్టం చేశారు.