Share News

Seethakka: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:14 AM

మాజీ సర్పంచులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను విడుదల చేస్తుందని, బీఆర్‌ఎస్‌ రాజకీయ కుట్రలో వారు బలి కావొద్దని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

  • సర్పంచ్‌ల ఆత్మహత్యలకు వారే కారణం

  • హరీశ్‌ హయాంలోనే పెండింగ్‌: సీతక్క

  • సర్పంచ్‌లూ.. విపక్షాల ఉచ్చులో పడొద్దు

  • మార్చిలోగా బకాయిలు క్లియర్‌: పొన్నం

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మాజీ సర్పంచులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులను విడుదల చేస్తుందని, బీఆర్‌ఎస్‌ రాజకీయ కుట్రలో వారు బలి కావొద్దని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్థిశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. తాము అధికారం చేపట్టాక. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లుల్లో ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఈ మేరకు సీతక్క సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ సర్పంచ్‌ల బాధ, ఆవేదన తమకు తెలుసని, అందుకే ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్‌ చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సర్పంచ్‌లతో బలవంతంగా పనులు చేయించి.. వారికి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కేసీఆర్‌, హరీశ్‌రావు కారణం కాదా? అని ప్రశ్నించారు. పనులు చేయించుకుని బిల్లులు చెల్లించని ఆ ఇద్దరి నివాసాల ముందు మాజీ సర్పంచ్‌లు ధర్నాలు చేయాలని సూచించారు. హరీశ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడే.. బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మాజీ సర్పంచ్‌లకు తెలుసునని. ఆర్థిక శాఖను, అధికారాన్ని చేతిలో పెట్టుకొని సర్పంచ్‌ల ఆత్మహత్యలకు కారణమైందే హరీశ్‌ అని ఆరోపించారు. ఏళ్లతరబడి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందిపెట్టిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు మాజీ సర్పంచులను రెచ్చగొడుతోందని, వారి తీరు చూస్తుంటే.. చంపినోడే తద్దినం పెట్టినట్లుగా ఉందన్నారు.


  • బీఆర్‌ఎస్‌ నేతల మొసలి కన్నీరు

సర్పంచ్‌ల ఆత్మహత్యకు కారణమైన బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. విపక్షాల ఉచ్చులో పడొద్దంటూ సర్పంచ్‌లకు విజ్ఞప్తి చేశారు. ‘‘సర్పంచ్‌లూ.. తొందరపడకండి! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వచ్చే ఏడాది మార్చి చివరిలోగా విడతల వారీగా మీ బకాయిలు క్లియర్‌ చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో సోమవారం పొన్నం మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సర్పంచ్‌లు పడే బాధలు తమకు తెలుసునని, ప్రస్తుతం సర్పంచ్‌ల పరిస్థితికి బీఆర్‌ఎస్‌ పాలకులే కారణం అని ఆరోపించారు. సర్పంచ్‌ల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడటం.. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లడం అన్న చందమేనని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేదన్నారు. తమను ఆయన ప్రశ్నించే ముందు గత పదేళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.


ఈ అంశమ్మీద సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమా? అని కిషన్‌రెడ్డికి సవాలు విసిరారు. వరదల కారణంగా తెలంగాణలో రూ.10 వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.400 కోట్లు ఇచ్చిందని, దీన్ని బట్టి కేంద్రం వద్ద కిషన్‌రెడ్డి బలం ఏపాటిదో అర్థమవుతోందని విమర్శించారు. ఆయన రక్తంలో తెలంగాణ డీఎన్‌ఏ ఉంటే గనక రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురావాలన్నారు. కాగా తొలుత సర్పంచ్‌ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పిన తర్వాతే హరీశ్‌కు వారి బకాయిల పైన మాట్లాడే హక్కు ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఈ బకాయిలకు కారణం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. వారి హయాంలో పదుల సంఖ్యలో సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఏ ఒక్క కుటుంబాన్నీ హరీశ్‌ రావు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల పేరుతో సర్పంచ్‌లతో రూ. లక్షలు ఖర్చు పెట్టించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. రూ. 40 వేల కోట్ల వరకు బకాయిలు పెట్టి.. వారిని ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. సమయానికి పనులు చేయలేదని కొంతమందిని సస్పెండ్‌ కూడా చేయించిందన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ దారి మళ్లించి పంచాయతీల పొట్ట కొట్టిందన్నారు. ఈనాటి సర్పంచ్‌ల దుస్థితికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ చైర్మన్‌ రాచమళ్ల సిద్ధేశ్వర్‌ అన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 04:14 AM