Kaleshwaram: బ్యారేజీల పరిశీలనకు అధునాతన టెక్నాలజీ.. కమిటీకి పూర్తి సహకారం ఉంటుందన్న ఉత్తమ్
ABN , Publish Date - Mar 06 , 2024 | 08:24 PM
కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై అధ్యయనానికి ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. "బ్యారేజ్ డ్యామేజీకి గల కారణాలు చెప్పాలి. సమస్యకు కారణం ఎవరు అనేది అడిగాం. వర్షాలు రాకముందే మేడిగడ్డ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. బ్యారేజీలకు మరమ్మతులు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. NDSA కమిటీకి పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ NDSA కమిటీకి ఇవ్వాలని కోరుతున్నాం. ఎవరైనా NDSA కమిటీకి సహకరించకపోతే, డాక్యుమెంట్స్ దాచితే కఠిన చర్యలు తీసుకుంటాం. గురువారం ఉదయం మేడిగడ్డ, తరువాత అన్నారం బ్యారేజీల పరిశీలన ఉంటుంది. 8వ తేదీ సుందిల్ల బ్యారేజ్‌ని పరిశీలిస్తాం. కాళేశ్వరం మళ్లీ అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిది. వర్షాకాలానికి ముందే అందుబాటులోకి వస్తే మరీ మంచిది. ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రభుత్వం చట్టప్రకారం వెళ్తోంది" అని ఉత్తమ్ అన్నారు.