Share News

TG: ప్రారంభమైన ఎప్‌సెట్‌ పరీక్షలు..

ABN , Publish Date - May 08 , 2024 | 06:11 AM

నిమిషం లేటు నిబంధన.. ఎడతెరిపి లేని వానతో టీఎస్‌ ఎప్‌సెట్‌కు తొలిరోజు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

TG: ప్రారంభమైన ఎప్‌సెట్‌ పరీక్షలు..

  • నిమిషం నిబంధన.. వానతో విద్యార్థుల ఇక్కట్లు

  • మొదటి రోజు పరీక్షకు 91శాతం హాజరు

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌, మే 7: నిమిషం లేటు నిబంధన.. ఎడతెరిపి లేని వానతో టీఎస్‌ ఎప్‌సెట్‌కు తొలిరోజు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎప్‌సెట్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షకు తొలిరోజు 91శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 135 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగినట్లు పేర్కొన్నారు. 67,005మందికి గానూ, 60,859మంది హాజరైనట్లు వెల్లడించారు.


అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో 96.84శాతం మంది అభ్యర్థులు హాజరుకాగా, అత్యల్పంగా తిరుపతి సెంటర్‌లో 68.96శాతం హాజరైనట్లు తెలిపారు. పలు పరీక్ష కేంద్రాల్లో నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతివ్వలేదు. మల్లాపూర్‌ అయాన్‌ డిజిటల్‌ కేంద్రానికి 15 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యంగా రావడంతో సిబ్బంది అనుమతించలేదు. సాయంత్రం 4.30గంటల నుంచే ఈదురుగాలులు వీయడంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పరీక్షాకేంద్రాల్లో ఇంటర్నెట్‌ సమస్యలు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినట్లు సమాచారం. కాగా గండిపేట ఎంజీఐటీ కేంద్రంలో పరీక్ష 30 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పరీక్షాకేంద్రాల్లో 8 నిమిషాల ముందే కంప్యూటర్‌లో క్వశ్చన్‌పేపర్‌ ప్రత్యక్షమైనట్లు విద్యార్థులు తెలిపారు.


తిమ్మాపూర్‌లో రెండు గంటల ఆలస్యం

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని ఐయాన్‌ డిజిటల్‌ జోన్‌ పరీక్ష కేంద్రంలో టీఎస్‌ ఎప్‌సెట్‌ సెకండ్‌ సెషన్‌ పరీక్ష సాయంత్రం 6 గంటల వరకు జరగాల్సిన పరీక్ష రాత్రి 7.50 వరకు కొనసాగింది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం ఎదుట రాజీవ్‌ రహదారిపై ధర్నాకు దిగారు. విద్యార్ధులు పరీక్ష రాసి బయటకు వచ్చిన తరువాత వారు ఆందోళన విరమించారు. మధ్యాహ్నం తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో పరీక్ష కేంద్రంలో విద్యుత్‌ సరఫరా నిలిచి అంతరాయం ఏర్పడింది. ఎగ్జామినేషన్‌ చీఫ్‌ సూపరింటెండ్‌ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా సమయం ఇచ్చి పరీక్ష పూర్తి చేశామన్నారు.

Updated Date - May 08 , 2024 | 06:11 AM