Share News

BRS: రేవంత్‌ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత

ABN , Publish Date - Dec 24 , 2024 | 03:35 AM

‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్‌రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు.

BRS: రేవంత్‌ పాలనలో కక్షలు తప్ప రక్షణ లేదు:కవిత

హైదరాబాద్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్‌రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు. ప్రజాప్రయోజన కార్యక్రమాలు అసలే లేవు’’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆమె చిట్‌చాట్‌ నిర్వహించారు. కేసీఆర్‌, కేసీఆర్‌ కుటుంబం, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారని, దీంతో తమపార్టీ ప్రత్యేకంగా లీగల్‌సెల్‌ ఏర్పాటు చేసుకొని న్యాయపోరాటం సాగించాల్సి వస్తోందన్నారు.


రాష్ట్రంలో కొనసాగుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అయినా.. దాన్ని నడుపుతున్నది బీజేపీ వాళ్లని ఆరోపించారు. ప్రతీకార పాలనకు తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాతనే కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చారన్నారు. తదనంతరం ఏసీబీ కేసు నమోదు, మరుసటి రోజే ఈడీ కేసు నమోదు చేసిందని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలతోనే కేటీఆర్‌పై కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. కేసీఆర్‌ వంటి బలమైన నాయకులను దెబ్బకొట్టాలని ఆ రెండు పార్టీల ప్రయత్నం ఇక్కడ సాధ్యంకాదని చెప్పారు. సీఎం తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టుపెడుతున్నారని, దీనిపై కమ్యూనిస్టులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు.

Updated Date - Dec 24 , 2024 | 03:35 AM