Share News

MP Raghunandan Rao: నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. రండి..

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:42 AM

బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూశారన్నారు.

MP Raghunandan Rao: నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. రండి..

ఢిల్లీ: బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూశారన్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనన్నారు. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైఖరి ఒకటే ఏం మారలేదన్నారు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారడమేనని రఘునందన్ రావు అన్నారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ. 20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారని రఘునందన్ రావు అన్నారు.


రూ.30 వేలు అవుతుంది.. ఇచ్చారా?

ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామన్నారని.. ఆ లెక్కన ఏడాదికి రూ.30 వేలు అవుతుందని.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. దీనికి బడ్జెట్‌లో కేటాయింపులు ఏవని రఘునందన్ నిలదీశారు. వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారని.. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారని.. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 9 లక్షల పైనే ఉందన్నారు. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ. 1 లక్ష పైన ఉందన్నారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉందని.. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26 వేల కోట్లుగా చూపించారన్నారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ. 21 వేల కోట్ల పైన చూపించారని రఘునందన్ అన్నారు.


ముక్కు నేలకు రాయండి..

ఈ రెండు కలిపితే దాదాపు రూ. 50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయన్నారు. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలన్నారు. ‘నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి’ అని రఘునందన్ అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా.. లేదా? అని రఘునందన్ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయని రఘునందన్ రావు అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.10 లక్షలకు కేంద్రం పెంచిందన్నారు. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారన్నారు. మైనారిటీల పండుగల కోసం రూ. 33 కోట్లు కేటాయించారని.. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా? అని రఘునందన్ ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి:

కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 11:42 AM