Congress: నా జీవిత కల సాకారం అయింది.. సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో తుమ్మల
ABN , Publish Date - Aug 15 , 2024 | 02:52 PM
సీతారామ ఎత్తిపోతల పథకం(sita rama lift irrigation project) ప్రారంభోత్సవంతో తన రాజకీయ జీవిత కల సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) పేర్కొన్నారు.
ఖమ్మం: సీతారామ ఎత్తిపోతల పథకం(sita rama lift irrigation project) ప్రారంభోత్సవంతో తన రాజకీయ జీవిత కల సాకారమైందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Thummala Nageswara Rao) పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టగా.. పంప్ హౌజ్ మోటర్లు పాడవకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల హడావిడి ఉన్నా.. సీఎం రేవంత్ సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం వచ్చారని తెలిపారు.
"ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేస్తే సత్తుపల్లి ట్రంక్ పరిధిలో ఆయకట్టుకు, జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేస్తే పాలేరుకు గోదావరి జలాలు అందుతాయి. రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ భద్రాద్రి రాములవారి పాదాల వద్ద ప్రకటన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఇవాళ సగర్వంగా వైరా సభ నిర్వహిస్తున్నాం. నాగార్జున సాగర్ నీళ్ళు రాని పక్షంలో గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టుకు నీరందిస్తాం. తక్కువ సమయంలో 70 రోజుల్లో వైరా లింక్ కెనాల్ పూర్తి చేశాం. ఓ పక్క సాగుకు దన్నుగా నిలుస్తూ.. మరోపక్క రైతు రుణమాఫీ చేసి మాది రైతన్నల పక్షమే అని నిరూపించుకున్నాం. మిగిలి ఉన్న సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు సకాలంలో పూర్తిచేస్తాం" అని నాగేశ్వరరావు అన్నారు.
నీళ్లు చల్లుకోవడానికి రాలేదు
సీతారామ ప్రాజెక్ట్‌పై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని తుమ్మల మండిపడ్డారు. తాను నీళ్లు చల్లుకోవడానికి రాలేదని.. బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి గోదారమ్మ ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. "ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. చిల్లర మాటలతో చేసే రాజకీయాలకు విలువ లేదు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర నియోజకవర్గాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు" అని తుమ్మల ప్రశ్నించారు.