జానపహాడ్‌లో వైభవంగా గంధం ఊరేగింపు
ABN , Publish Date - Jan 27 , 2024 | 12:59 AM
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్ సైదులు దర్గా ఉర్సులో భాగంగా రెండరోజైన శుక్రవారం గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు.
జాన్‌పహాడ్ ఉర్సుకు రెండోరోజూ తరలివచ్చిన ప్రజలు
గంధం ఊరేగింపులో పాల్గొన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పాలకవీడు, జనవరి 26 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జానపహాడ్ సైదులు దర్గా ఉర్సులో భాగంగా రెండరోజైన శుక్రవారం గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తెచ్చిన గంధాన్ని ముజావర్ జానీ చందల్‌ఖానాలో ఉంచారు. ఆ గంధాన్ని ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఊరేగించారు. గంధం బిందెలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎత్తుకొని దర్గాలోని చందల్‌ఖానాకు తీసుకువచ్చారు. అనంతరం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం గంధాన్ని కల్మెటతండా, జాన్‌పహాడ్, చెర్వుతండా గ్రామాల్లో ఊరేగించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డేలు దర్గాలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు గురువారం రాత్రి నుంచే దర్గాకు చేరుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అనంతరం దర్గాలోని హజ్రత్‌సయ్యద్ మోహినుద్దీన్‌షా, జాన్‌పాక్ షహీద్ రహమతుల్లా సమాధులపైకి ఎక్కించారు. ఆ సమయంలో భక్తులను దర్గాలోకి అనుమతించలేదు. తొక్కిసలాట జరుగకుండా పోలీసులను పెద్దసంఖ్యలో మోహరించడంతో పాటు బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో దర్శనాలు సాఫీగా సాగాయి. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లాల నుంచి లక్షకు పైగా భక్తులు తరలివచ్చినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా కృష్నానది ఆవల ఉన్న గ్రామాల్లోని భక్తులు పెద్దసంఖ్యలో కృష్ణానదిలో పుట్టిపై ప్రయాణించి దర్గాకు చేరుకున్నారు. గంధం అందుకునే క్రమంలో స్వల్పగాయాలైన భక్తులకు వైద్యసేవలు అందించారు. గురువారం సాయంత్రం నుంచే భక్తుల రద్దీతో దర్గా ప్రాంతం రద్దీగా మారింది. ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, సీఐలు రామలింగారెడ్డి, రవి, పాలకవీడు ఎస్‌ఐలు లింగయ్యతో పాటు నేరేడుచర్ల, మఠంపల్లి, గరిడేపల్లి, హుజూర్‌నగర్ ఎస్‌ఐలు, స్థానిక తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారిలతో పాటు 450మంది పోలీస్ సిబ్బంది భక్తులకు సేవలందించారు.