Share News

ఉమ్మడి జిల్లాకు కొత్త రైల్వేలైన

ABN , Publish Date - Apr 03 , 2024 | 11:50 PM

ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కొత్త రైల్వేలైనకు మార్గం సుగమమైంది. డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.

ఉమ్మడి జిల్లాకు కొత్త రైల్వేలైన

డోర్నకల్‌-గద్వాల లైనకు మార్గం సుగమం

త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

సూర్యాపేట, నల్లగొండ జిల్లాల మీదుగా..

పల్లెలు, తండాల్లో వినబడనున్న రైలు కూత

నల్లగొండ, ఏప్రిల్‌ 3 : ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా కొత్త రైల్వేలైనకు మార్గం సుగమమైంది. డోర్నకల్‌ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. సూర్యాపేట, నల్లగొండ జిల్లా ప్రజలకు, రైలు ప్రయాణికులకు సౌత సెంట్రల్‌ రైల్వే(ఎ్‌ససీఆర్‌) శుభవార్త చెప్పడంతో ప్రతీ ఒక్కరిలో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే ఈ రైల్వే నిర్మాణం చేపడితే ఈ రెండు జిల్లాల్లోని పల్లెలు, తండాల్లో రైలు కూతలు వినపడనుంది. సౌత సెంట్రల్‌ రైల్వే గత ఏడాది ఈ ప్రతిపాదనలకు అంగీకరించడంతో డోర్నకల్‌ - గద్వాల రైలు మార్గానికి సంబంధించి సర్వేతో పాటు ఇతర పనులు చకాచకా జరుగుతున్నాయి. రైలు మార్గం నిర్మాణానికి అవసరమైన తుది సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మోతె మండలంలో సర్వే మార్కింగ్‌ చేపట్టారు. నూతన రైల్వేమార్గం సర్వే పనులు డోర్నకల్‌ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకనగూడెం మీదుగా మోతె మండలం కొత్తగూడెం ప్రాంతంలో జరిగాయి. ఇప్పటికే తుది స్థాన సర్వే(ఫైనల్‌ లోకేషన)లో భాగంగా మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లి తదితర గ్రామాల వద్ద రహదారి పాసింగ్‌లను సైతం గుర్తించిన సర్వే బృందం మార్కింగ్‌ కూడా చేసింది. ఈ రైలుమార్గానికి ఎఫ్‌ఎల్‌ఎస్‌ సర్వే కోసం గత సంవత్సరం ఎస్‌సీఆర్‌ రూ.7.40కోట్లను మంజూరు చేసింది. సుమారు 296 కిలోమీటర్ల పొడవున్న ఈ రైలుమార్గం నిర్మాణానికి రూ.5,330కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దక్షిణ తెలంగాణలోని కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, బీమారం, తిప్పర్తి, నల్లగొండ, కనగల్‌, చండూరు, నాంపల్లి, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, బూతపూర్‌ వంటి ప్రధాన ప్రాంతాలను కలుపుతూ ఈ రైలు మార్గం సాగనుంది.

ప్రయాణికులకు పెరగనున్న సేవలు

సికింద్రాబాద్‌ - విజయవాడ రైల్వేలైన ప్రాంతంలో ఈ కొత్తమార్గం సుగమం కావడంతో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు, త్వరితగతిన ప్రయాణం చేసే అవకాశాలు దక్కనున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, సికింద్రాబాద్‌, విజయవాడ రైలుమార్గాలను అనుసంధానం చేసేలా పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగుళూరు మధ్య రైలు మార్గాలున్నాయి. ఈ రెండింటినీ అనుసంధానం చేసే రైలుమార్గం అవసరాన్ని సౌత సెంట్రల్‌ రైల్వే గుర్తించింది. ఇప్పటివరకు రైలు మార్గం లేని ప్రాంతాల మీదుగా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించి డోర్నకల్‌ -గద్వాల రైలు ప్రాజెక్టు తీసుకురావాలని నిర్ణయం తీసుకుని అందుకు అనుగుణంగా ఫైనల్‌ లోకేషన సర్వేను చేపట్టింది. డోర్నకల్‌ - గద్వాల్‌ లైనతో ఉమ్మడి జిల్లాలైన వరంగల్‌, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, మహుబూబ్‌నగర్‌ వాసులకు ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడనుంది. కొత్త రైల్వేమార్గం పనులను ముందుగా మహుబుబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నుంచి ప్రారంభించి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకనగూడెం మీదుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మోతె మండలంలోని కొత్తగూడెం వరకు చేపడుతారు. డోర్నకల్‌ - గద్వాల లైనతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల వాసులు డోర్నకల్‌ నుంచి మొదలుకుని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన ప్రయాణికులు గద్వాల వరకు ప్రయాణించే వీలుంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు లేదా ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొత్త రైల్వేలైన పూర్తయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు బెంగుళూరు వెళ్లడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

Updated Date - Apr 03 , 2024 | 11:50 PM