ఎంజీయూలో అన్నీ సమస్యలే
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:24 AM
మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పటకినీ అందులో మెరుగైన పరిస్థితులు కానరావడం లేదు.
అభివృద్ధికి విడుదల కానీ నిధులు
పర్మినెంట్ ఫ్యాకల్టీ లేక కుంటుపడుతున్న విద్యాబోధన
నల్లగొండ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ యూనివర్సిటీ(ఎంజీయూ)లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పటకినీ అందులో మెరుగైన పరిస్థితులు కానరావడం లేదు. ఉన్నత విద్యను, ప్రత్యేక కోర్సులను అందించడం కోసం యూనివర్సిటీ ఏర్పాటు అయినప్పటికీ పర్మినెంట్ లేకుండా అవుట్‌సోర్సింగ్ సిబ్బందితోనే నడుపుతున్నారు. పలుమార్లు వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన ఎంజీయూలో ఏ మాత్రం మార్పు రాలేదన్నది జగమెరిగిన సత్యం. వందలాది ఎకరాలల్లో యూనివర్సిటీని ఏర్పాటు చేసినప్పటికి అభివృద్ధి మాత్రం నామమాత్రంగానే కనిపిస్తోంది. విద్యార్థిని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంతో పాటు హాస్టళ్లల్లో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ వసతులు సరిగా లేవని విద్యార్థులు వాపోతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచే కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం యూనివర్సిటీలో చదువుకోవడానికి విద్యార్థులు వస్తుంటారు. పేరుకే యూనివర్సిటీ అయినప్పటికినీ అందుకు అనుగుణంగా విద్యాబోధనతో పాటు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
2009 నుంచి గెస్ట్ ఫ్యాకల్టీతోనే...
2009 సంవత్సరం నుంచి గెస్ట్ ఫ్యాకల్టీతోనే విద్యాబోధన జరుగుతోంది. అప్పటి నుంచి ఉన్న కోర్సులు తప్ప కొత్త కోర్సులను ఏర్పాటుచేయని పరిస్థితి ఉంది. అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన కాలం గడుపుతున్న యంత్రాంగం రెగ్యులర్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. యూనివర్సిటీలోని పలు విభాగాల్లో పీహెచడీ అడ్మిషన్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. పలు కోర్సులకు పర్మినెంట్ ప్రొఫెసర్లు కూడా లేరు. తెలుగు విభాగానికి సంబంధించి ప్రొఫెసర్లు లేకపోవడంతో అవుట్ సోర్సింగ్ ద్వారానే నడిపే పరిస్థితి ఉంది. మొత్తం 165మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిన కేవలం 40మందితోనే విద్యాబోధన జరుగుతోంది. ఇక 300మంది వరకు నానటీచింగ్ సిబ్బంది అవసరం ఉండగా నలుగురు మాత్రమే పర్మినెంట్ సిబ్బంది మిగతా 200మంది వరకు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. 2012లో ఒకే ఒక నోటిఫికేషన విడుదల చేయగా అప్పట్లో జరిగిన నియామకాలపై అనేక ఆరోపణలు వెలువడ్డాయి. అయితే వచ్చిన ఆరోపణలపై కొంతమంది ప్రొఫెసర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టే ద్వారా 31మంది యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. 2013-14 సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులోకి వచ్చినప్పటికినీ ఆ కోర్సులకు విద్యాబోధన చేయడానికి సరిపడా ఫ్యాకల్టీ లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో సైతం ఐదు, ఆరు కోర్సులకు పరిమితం కావడంతో తమకు కావాల్సిన కోర్సులు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు ఎంజీయూలో చేరకుండా ఇతర కళాశాలల్లో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి.
యూనివర్సిటీకి నిధుల కొరత
మహాత్మాగాంధీ యూనివర్సిటీకి నిధుల కొరత తీవ్రంగా ఉంది. అందులో పనిచేస్తున్న ప్రొఫెసర్లకు, సిబ్బందికి జీతభత్యాలు తప్ప పదేళ్లుగా ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. మొదట్లో రూ.2కోట్లు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పటికీ అది కాస్తా కాగితాలకే పరిమితం కావడం తప్ప నిధులు మాత్రం విడుదల కాలేదు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతోనే కాస్తోకూస్తో అభివృద్ధి తప్ప ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు చెల్లించకపోవడం గమనార్హం. ఫ్యాకల్టీ కోసం రూ.10కోట్లతో క్వార్టర్స్ నిర్మించినా అవి నిరుపయోగం ఉన్నట్లు సమాచారం. ఫ్యాకల్టీకి క్వార్టర్స్ కేటాయిస్తే వారు అందుబాటులో ఉండే అవకాశాలు ఉంటాయి. యూనివర్సిటీకి నిధులు కొరత తీవ్రంగా ఉండటంతో అభివృద్ధి ఆమడ దూరంలో నిలిచిపోయింది. యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు అంటే ఆర్ట్స్ విభాగం సంబంధించి పొలిటికల్ సైన్స, హిస్టరీ వంటి గ్రూప్‌లు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అనేక రకాల కొత్త కోర్సులకు నోటిఫికేషన 2009 నుంచి వెలువడకపోవడానికి నిధుల కొరతతే కారణమని విద్యార్థి సంఘాల నాయకుల ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కొత్త కోర్సులు ఏర్పాటైతేనే ఎంజీయూపై విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది. కానీ పాత కోర్సులతోనే కాలం గడుపుతూ అవుట్‌సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీతో విద్యాబోధన చేస్తూ అదేవిధంగా ఉంటే పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి అయితే పనిచేసే ప్రొఫెసర్లకు నానటీచింగ్, టీచింగ్ సిబ్బందికి జీతాలు ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తును పట్టించుకోకపోవడం వల్లనే యూనివర్సిటీ అభివృద్ధిపై నీలినీడలు అలుముకుంటున్నాయి.
ఎంజీయూ వీసీకి సవాళ్ల స్వాగతం
నూతనంగా వీసీగా బాధ్యతలు స్వీకరించిన అల్తాఫ్ హుస్సేనకు సమస్యలు స్వాగతం పలకడంతో పాటు సవాళ్లుగా మారాయి. ఆయన గతంలో 2016 జూలై నుంచి 2019 జూన 29 వరకు ఎంజీయూ వైస్‌ఛాన్సలర్‌గా సేవలు అందించారు. న్యాక్ అక్రిడేషనకు ఆయన నాయకత్వం వహించి బీ-గ్రేడ్ సాధనకు కృషి చేశారు. విశేష అనుభవం కలిగిన అల్తాఫ్ హుస్సేనకు మరోసారి వీసీగా బాధ్యతలు అప్పగించడంతో ఆయన యూనివర్సిటీని మరింత బలోపేతం చేస్తారన్నా ఆశలు చిగురించాయి. మరోసారి బాధ్యతలు చేపట్టిన వీసీ యూనివర్సిటీలో తిష్ట వేసిన సమస్యలను ఏవిధంగా పరిష్కరిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూనివర్సిటీలో ఓ వైపు అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి నిధులను సాధించడంతో పాటు ఎంజీయూను రాష్ట్రంలోనే మిగతా యూనివర్సిటీల కంటే మెరుగైన స్థానంలో నిలబడి ఆదర్శంగా ఉండాలంటే విద్యాబోధనను మెరుగుపర్చాల్సి ఉంటుంది. అతిథి అధ్యాపకులు అరకొరగా ఉండటంతో విద్యాబోధనపై ప్రభావం చూపిస్తోంది. విద్యార్థులకు వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.